calender_icon.png 22 December, 2024 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మినీ కవితా ప్రస్థానం

14-10-2024 12:00:00 AM

ఇంటికి తూర్పు ద్వారం మహర్దశ 

పయనానికి దిశానిర్దేశం మహర్దశ 

జ్ఞానానికి దశదిశలా వ్యాప్తి ధన్యం 

సత్యమిదే తెలుసుకో మిత్రమా.

 బుర్రా వెంకటేశం, ఐఏఎస్

20న గుంటూరు శేషేంద్రశర్మ జయంతి :

‘కళ కళకోసం కాదు, ప్రజల కోసం’ అన్న సాంస్కృతిక చైతన్యం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కాలంలో తెలుగునాట ‘సాహిత్యం కేవలం పండితులకేనా, పామరులకు ఎందుకు అందుబాటులోకి రాకూడదు?’ అన్న తపన  మొదలైంది. ‘పద్యం భారతికి నైవేద్యం’ అనే సంప్రదాయ వాదులకు, ‘దిగి రాము దిగిరాము, దివినుండి భువికి..’

అని భీష్మించుకునే సారస్వత సనాతన వాదులకు ఓ నమస్కారం సమర్పించి, వచన కవితా మహోద్యమం ప్రారంభమైంది ఆ రోజుల్లోనే. ప్రౌఢ కవిత్వంలో అప్పటికే సమకాలీన  సారస్వత మూర్తుల నీరాజనాలందుకున్న గుంటూరు శేషేంద్రశర్మ ఋతుఘోష, సొరాబు వంటి పద్యకావ్యాలు రచించిన తరువాత అనూహ్యంగా వచన కవితను స్వాగతించారు.

సామాజిక సమస్యలపై తొలిసారిగా ‘గొరిల్లా’, ‘నా దేశం -నా ప్రజలు’, ‘సముద్రం నా పేరు’ మొదలైన వచన దీర్ఘకావ్యాలు రచించి సంచలనాలకు కేంద్ర బిందువయ్యారు. ఇలా కొనసాగుతున్న శేషేంద్ర సాహితీ ప్రస్థానంలో మరో మలుపు మినీ కవిత. పండితులకైనా, పామరులకైనా కళా హృదయం ఒకటే. సంక్షేమ కార్యక్రమాల్లో చోటు చేసుకునే సామాజిక న్యాయం సారస్వతంలో లేకపోవడం అన్యాయమని గమనించిన శేషేంద్ర మరో అడుగు ముందుకు వేశారు.

లఘు కవతా ప్రక్రియకు ఆద్యుడు

సాహిత్యం సర్వజన హితం, సరళ సుందరం కావడంతోపాటు సంక్షిప్తరూపమూ ప్రధానమని ఆయన గుర్తించారు. పాయసాన్ని గంగాళాల్లో నింపడం కన్నా గాజు గ్లాసులో అందిస్తే తక్షణమే ఆస్వాద యోగ్యమవుతుందని శేషేంద్ర భావించారు. ఈ దశలోనే లఘు కవిత లేదా మినీ కవిత అనే సారస్వత ప్రక్రియకు ఆయన ఆద్యులయ్యారు.

ప్రాచీన కాలంలోని సుభాషితాలు, శతకాలు, వేమన పద్యాలు కూడా ఆనాటి లఘు కవితలే! అయితే, అవన్నీ శ్లోకాలు, పద్యాల రూపంలోనే వెలుపడ్డాయి. అందుకే, ఈనాడు మరింత సరళతరంగా  వ్యావహారిక వచన శైలిలో వ్యంగ్య, చమత్కార వైభవం, భావ గాంభీర్యం వంటి అదనపు లక్షణాలను జత చేసి మినీ కవితా ప్రభంజనం సృష్టించారు శేషేంద్ర.

శేషేంద్ర ఆశావాది. ఎర్రటి సూర్యాస్తమయాలను అవగాహనం చేసుకున్న నేటి యువకులే రే పటి భవిష్యత్తుకు నావికులని ఆయన ఆకాంక్షించారు. 1917 అక్టోబర్‌లో రష్యాలో జరిగిన బోల్ష్ విక్  విప్లవాన్ని ‘అక్టోబర్ విప్లవం’ అంటారు. ఓ దశాబ్దం తర్వాత అంటే 1927 అక్టోబర్ 20న శే షేంద్ర జన్మించారు. అందుకే “అక్టోబరులో నే ను పుట్టాను/ అక్టోబరులోనే విప్లవం పుట్టింది” అని సగర్వంగా ప్రకటించారు.

అంతేకాదు, ‘ఆధునిక మహాభారతం’లో ప్రతి పర్వం చివరలో ప్రబంధ సాంప్రదాయాన్ని అనుసరిస్తూ “విప్లవ భాషా విధాత, కవిసేన మేనిఫెస్టో ప్రణేత, బుధజన విధేయ శేషేంద్ర నామధేయ..” అని సాగే స్వీయ పరిచయంలోనూ విప్లవాన్ని స్మరిస్తూ తన్మయులయ్యారు. అక్టోబర్ తర్వాత విప్లవంతో పెనవేసుకున్న మరో నెల మే. అదే మే డే. కాకతాళీయంగా శేషేంద్ర నిర్యాణం మే నెలలోనే. జనన మరణాలను అనూహ్యంగా విప్లవంతో అనుసంధానం చేసుకున్న కాలజ్ఞులు శేషేంద్ర. 

 డా. వెనిగళ్ళ రాంబాబు

సినీగీత రచయిత, 98480 44329