calender_icon.png 20 November, 2024 | 8:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థికవృద్ధిలో ఖనిజాలదే ముఖ్యపాత్ర

21-07-2024 03:05:00 AM

  1. మినరల్స్ సెక్టార్ లేకుండా స్వయం సమృద్ధి అసాధ్యం
  2. ప్రైవేటు భాగస్వామ్యంతో గనుల తవ్వకం
  3. ఖనిజ సంపదను అన్వేషించేందకు టెక్నాలజీ సాయం
  4. కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారుచేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని, అందుకోసం వికసిత్ భారత్ విజన్‌తో ముందు కెళ్తున్నామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. విజన్ సాధనలో మైనింగ్ సెక్టార్ ముఖ్యమైన పాత్ర పోషించనుందని చెప్పారు. బలమైన మైనింగ్, మినరల్స్ సెక్టార్ లేకుండా స్వయం సమృద్ధి సాధ్యం కాదని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారని, ఆ రెండూ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభా లన్నారు.

శనివారం బేగంపేటలోని వివంతా హోటల్‌లో జరిగిన మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ హ్యాకథాన్, క్రిటికల్ మినరల్ రోడ్ షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. గనుల ఎక్స్‌ప్లోరేషన్‌కు ఇది చాలా ముఖ్యమైన సందర్భ మన్నారు. ప్రభుతేొ్వ-ప్రైవేటు రంగ భాగస్వామ్యంలో గనుల తవ్వకంలో నూతన ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందన్నారు. మైనింగ్ ప్రాంతాల్లోని ప్రజల సంక్షేమం, క్లీన్ ఎనర్జీని పెంపొందించడమే తమ సర్కారు ఉద్దేశమన్నారు. 

మినరల్స్‌కు పెరుగుతున్న డిమాండ్

భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, మినరల్స్‌కు డిమాండ్ పెరుగుతున్నదని కిషన్‌రెడ్డి వెల్లడించారు. అందుకే ఆధునిక టెక్నాలజీతో ఖనిజ సంపదను అన్వేషించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దీనికోసం జీఎస్‌ఐ ద్వారా ఎక్స్‌టెన్సివ్ జియోలాజికల్ డేటాను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఎక్స్‌ప్లోరేషన్‌ను పెంచడానికి నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్ట్‌ను కూడా ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు ప్రైవేట్ కంపెనీలను కూడా నోటిఫై చేశామని చెప్పుకొచ్చారు. ఖనిజాల అన్వేషణలో జీఎస్‌ఐ కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. 2015కు ముందు మైనింగ్ సెక్టార్‌లో అనేక సవాళ్లు ఉండేవన్నారు. బ్లాక్స్ కేటాయింపుపై అనేక కోర్టు కేసులు నడిచేవని, రాష్ర్ట ప్రభుత్వాలకు తగిన భాగస్వామ్యం లభించేది కాదన్నారు.

తగిన నిర్ణయం తీసుకోకపోవడం వల్ల గ్రాంట్, రెన్యువల్స్ ఆగిపోయేవన్నారు. 2015లో ప్రధాని మోదీ ఎంఎండీఆర్ చట్టంలో పలు సవరణలు తెచ్చిన తర్వాతే మైనింగ్ సెక్టార్‌లో సంస్కరణలు మొదలైనట్లు కేంద్రమంత్రి వెల్లడించారు. ఆ సంస్కరణల లాభం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నదన్నారు. ఇప్పటివరకు 373కి పైగా మైనింగ్ బ్లాక్స్ వేలం పూర్తయిందన్నారు. 2023లో 24 క్రిటికల్ అండ్ స్ట్రాటజికల్ బ్లాక్స్‌ను వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇప్పటికే క్రిటికల్ మినరల్ గనులను మూడు విడతల్లో వేలం వేశామని, నాలుగో విడత వేలం ప్రక్రియలో ఈ కార్యక్రమం చాలా కీలకమన్నారు. భారత ఆర్థిక వృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి బిడ్డర్లకు ఇదొక ఒక గొప్ప అవకాశమని కిషన్‌రెడ్డి సూచించారు. 

నేషనల్ డీఎంఎఫ్ పోర్టల్ ప్రారంభం

ఖనిజాల గుర్తింపు, సమన్వయం కోసం తీసుకొచ్చిన నేషనల్ డీఎంఎఫ్ పోర్టల్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీహార్ ఉపముఖ్యమంత్రి విజయ్‌కుమార్ సిన్హా, మైన్స్ మినిస్ట్రీ జాయింట్ సెక్రెటరీ వీణకుమారి, జీఎస్‌ఐ డైరెక్టర్ జనరల్ జనార్ధన్ ప్రసాద్, తెలంగాణ డీజీఎం సుశీల్‌కుమార్ పాల్గొన్నారు.