calender_icon.png 8 October, 2024 | 5:04 AM

ఎంఐఎం X కాంగ్రెస్

08-10-2024 01:02:33 AM

ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్,   కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ వర్గీయుల బాహాబాహీ

పోలీసులు చూస్తుండగానే పరస్పరం రాళ్లతో దాడి

పీఎస్‌లో ఇరువర్గాల ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 7 (విజయక్రాంతి): నగర పరిధిలోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రాజకీయ విభేదాలు భగ్గుమన్నాయి. ఎంఐఎం ఎమ్మె ల్యే మాజీద్ హుస్సేన్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ సోమవారం బాహాబాహీకి దిగారు. పోలీసులు చూస్తుండగానే రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు ఒకరిపై రాళ్లు రువ్వుకున్నా రు. దీంతో ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది.

పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయనగర్ కాలనీ డివిజన్ ఫెరోజ్‌గాంధీనగర్‌లో సీసీ రోడ్డు పనులు జరుగుతున్నాయి. పనులు జరుగుతుండగా అక్కడి గుంతలో పడి ఓ వృద్ధుడు గాయాల పాలయ్యాడు. క్షతగాత్రు డు కాంగ్రెస్‌పార్టీ నాంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి ఫిరోజ్‌ఖాన్‌కు ఈ విషయం చెప్పుకొన్నాడు.

దీంతో ఫిరోజ్ ఖాన్ సోమవారం సాయంత్రం తన అనుచరులతో కలిసి ఫెరోజ్‌గాంధీనగర్‌కు చేరుకున్నారు. ఇదే సమ యంలో స్థానిక మహిళ ఒకరు సీసీ రోడ్డు నిర్మించేందుకు ఎంఐఎం నాయకులు తమ వద్ద డబ్బులు అడుగుతున్నారని ఫిరోజ్‌ఖాన్‌తో చెప్పింది. దీంతో ఆయన ఎంఐఎం నేతలను విమర్శించారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మాజీద్ హుస్సేన్ వెంటనే ఫెరోజ్‌గాంధీనగర్‌కు చేరుకున్నారు.

ఫిరోజ్‌ఖాన్ ఎంఐఎంపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. అది కాస్తా ఘర్షణకు దారి తీసి పోలీసులు చూస్తుండగానే బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కర్రలతో దాడులు చేసుకున్నారు. దాడిలో పలువురికి గాయాలయ్యా యి. పోలీసులు రంగ ప్రవేశం చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. అనంతరం రెండు వర్గాలు హుమాయున్ నగర్ పోలీస్‌స్టేషన్ లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి.

కొనసాగుతున్న పహారా..

కాంగ్రెస్, ఎంఐఎం కార్యకర్తల గొడవ నేపథ్యంలో పోలీసులు నాంపల్లి నియోజకవర్గాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతా ల్లో భారీగా బలగాలను మోహరింపజేశా రు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పహారా కాస్తున్నారు.మెహిదీపట్నం - మల్లేపల్లి వైపు వాహనాలను అనుమతించలేదు. దీంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.