ఆధునిక వ్యవసాయం పేరుతో ఎడాపెడా రసాయనాలు వాడేస్తున్నాం. పంటలను విషపూరితం చేస్తున్నాం. సాగు భూములను సైతం ఎందుకు పనికిరాకుండా మార్చేస్తున్నాం. ఇవన్నీ సంగారెడ్డి జిల్లాకు చెందిన చంద్రమ్మను కదిలించాయి. రసాయనాల సాగుకు స్వస్తి చెబుతూ, మరుగునపడిన పాత పంటలను పరిచయం చేస్తోందీమే. ఎన్నో రకాల చిరుధాన్యాలను పండిస్తున్న చంద్రమ్మకు
‘ఇందిరా గాంధీ వ్యవసాయ పురస్కారం’ వరించింది. ఈ సందర్భంగా ఆమె పరిచయం..
పాత పంటలకు డిమాండ్
రెండు ఎకరాల భూమిలో పాత పంటలను సాగు చేస్తున్నా. ఒకే రకమైన పంటలు సాగు చేయడం వల్ల భూసారం దెబ్బతింటుంది. ఒక్కో సీజన్ లో ఒక్కో పంట పండిస్తున్నా.. అయితే పాత పంటలను పండించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ మార్కెట్లో పాత పంటలకు మంచి డిమాండ్ ఉంది. అందుకే సేంద్రియ వ్యవసాయం చేయడం నేర్చుకున్నా.
జడల చంద్రమ్మ, మహిళా రైతు
సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ మండలంలోని డెక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీ చిరుధాన్యాలను సాగు చేసేలా ప్రోత్సహిస్తోంది. సాగులోని కొత్త పద్ధతులను పరిచయం చేస్తూ అవగాహన కల్పిస్తోంది. జిల్లాలోని జహీరాబాద్, న్యాల్‌కల్, ఝరాసంగం, కోహీర్, మొగుడంపల్లి, రాయికోడ్ మహిళా రైతులు సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయంలో పెద్దగా అనుభవం లేకపోయినా, అక్షరం ముక్క రాకపోయినా పాత పంటలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అంతరించి పోతున్న చిరుధాన్యాలైన కొర్ర, సజ్జ, సామ, జొన్న, రాగులతోపాటు పలు రకాల పంటలు పండిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఝరాసంగం మండలంలోని బిడకన్నె గ్రామనికి చెందిన మహిళ రైతు జడల చంద్రమ్మకు పాత పంటలను పరిరక్షిస్తోంది. అనేక పంటలను పండిస్తున్నందుకుగానూ ఆమెకు ‘ఇందిరా గాంధీ వ్యవసాయ పురస్కారం’ దక్కింది.
విత్తనాలను నిల్వచేస్తూ..
వర్షాధార పంటలతోపాటు, పాత పంటలనూ సాగు చేయడం ఇక్కడి మహిళల ప్రత్యేకత. అయితే చిరుధాన్యాల విత్తనాలను ప్రతి ఏడాది నిల్వ చేసుకుంటూ పంటలు పండిస్తున్నారు. మార్కెట్‌లో విత్తనాలను కొనుగోలు చేయరు. రసాయన మందులు వినియోగించకుండా పూర్తిగా సేంద్రియ ఎరువులతో పంటలు సాగు చేస్తున్నారు. ఇందుకోసం ప్రకృతిసిద్ధమైన ఆకులు, పశువుల పేడతో సేంద్రియ ఎరువులను సొంతంగా తయారుచేసుకుంటున్నారు. వాటినే పంటలకు ఎరువుగా వాడుతున్నారు. ఎలాంటి రసాయనాలు వాడకుండా పంటలు పండిస్తుండటంతో వీరి పంటలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. మహిళ రైతుల పంటలను డీడీఎస్ కొనుగోలు చేసి మార్కేటింగ్ చేస్తోంది. అయితే ఆహార మిలెట్ నెట్‌వర్క్ ఆఫ్ ఇండియా(మినీ) దేశంలోని 15 రాష్ట్రాలకు చెందిన 145 సంస్థలు, రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పోషకాహార నిపుణులు, ఆహార నిపుణులతో ఏర్పడిన ఆఖిల భారత కూటమి మహిళలకు చేయూతనిస్తోంది.
పాత పంటలను పరిరక్షిస్తూ..
ఇక్కడి రైతులు సేంద్రియ వ్యవసాయం చేయడమే కాదు.. కనుమరగువుతున్న పాత పంటలను పండిస్తూ ఇతరులకు పరిచయం చేస్తు న్నారు. ఇందులో అనేక రకాల పాత పంటలున్నాయి. తెల్లమలెజొన్న, ఎర్రజోన్న, కాకిముట్టనిజొన్న, తెల్లకొర్ర, మంచి కొర్ర, నల్లకొర్రలు, ఎర్రకొర్రలు, తెల్లతైద, ఎర్రతైద, తెల్లసామ, నల్లసామ, కోడిసామ, ఆర్గులు, సజ్జలు, మంచి పెసరి, గంగపెసరి, బాలెంత పెసరి, తీగపెసరి, దేశిమినుములు, గడ్డినువ్వులు, తెల్లజమాల్, నువ్వులు, ఎర్రతోగరి, బుర్కతోగరి, తెల్లతోగరి, నల్లతోగరి, తెల్లఅనులు, నల్లఅనుములు, ఎర్రఅనుములు, ఎర్రబెబ్బర్లు, తెల్లబెబ్బర్లు, బైలుమక్కలు, ఉల్లలు, (ఎర్రవి, తెల్లవి, నల్లవి) ఎర్రపుండి, తెల్లపుండి, పెద్దబయిముగులు, బైలు నల్లబుడ్డివడ్లు, బైలు ఎర్రవడ్లు, బైలు తెల్లబుడ్డవడ్లు, బైలు ఉల్లిగడ్డ లాంటి పాత పంటలను పండిస్తూ గుర్తింపు పొందారు.