calender_icon.png 27 December, 2024 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లర్లు ఏకం.. రైతన్నలు ఆగం

03-11-2024 12:43:55 AM

  1. క్వింటాల్‌కు రూ.300 తగ్గించి కొనుగోలు 
  2. వ్యాపారులకు వరంలా వాతావరణం
  3. తరుగు, గుమస్తా రుసుం పేరిట అదనపు దోపిడీ 
  4. పెట్టుబడీ వచ్చేలా లేదని అన్నదాత ఆవేదన 

నల్లగొండ, నవంబర్ ౨ (విజయక్రాంతి): అమ్మబోతే అడివి.. కొనబోతే కొరివి అన్న ట్టు మారింది రాష్ట్రంలోని రైతుల పరిస్థితి. ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తే.. మిల్ల ర్లు సిండికేట్‌గా మారి అన్నదాతలను దోపిడీ చేస్తున్నారు.

తేమ, పచ్చ గింజ, ఇతరాత్ర కొర్రీలు పెట్టి క్వింటాల్‌కు రూ. 300 వరకు తగ్గించి రైతు కష్టాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. అకాల వర్షాలు, మబ్బుల వాతావర ణం, కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాల లేమీ కారణంగా రైతులు రైస్ మిల్లుల వైపు చూస్తున్నారు.

కానీ, వ్యాపారులు కనికరం లేకుండా వారిని కన్నీళ్లు పెట్టిస్తున్నా.. పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తున్నది. సంక్షేమం మాట అటుంచి పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కేలా చూడాలని వేడుకుంటున్నా పరిస్థితి మాత్రం మారడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నల్లగొండలో భారీగా వరి  

కాస్త ఆలస్యంగానైనా ఈ వానకాలంలో వర్షాలు బాగా కురువడంతో సాగునీటి ప్రాజెక్టులు నిండి జిల్లాలో భారీగా వరి సాగైంది. సాగర్ ఎడమ కాల్వ, లోలెవల్ కాల్వ, చెరువులు, మూసీ ప్రాజెక్టు, బోరుబావుల ఆధారంగా 5.12 లక్షల ఎకరాల్లో రైతు లు వరి సాగు చేశారు.

దాదాపు 12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు. అక్టోబర్ రెండో వారంలోనే కోతలు మొదలవడంతో ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా 340 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించింది. వీటి లో ప్రస్తుతం 70 వేల టన్నుల ధాన్యం ఉంది. ఇప్పటివరకు 12, 600 క్వింటాళ్లను కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు.

మిల్లర్ల దోపిడీ 

కొనుగోలు కేంద్రాలకు సన్నరకం ధాన్యం తీసుకెళ్లేందుకు రైతులు ఇష్టపడటం లేదు. తేమ 17 శాతం ఉండాలని నిబంధన ఉండటం, ప్రభుత్వం మద్దతు ధర సూచించిన రకాలు సాగు చేయకపోవడంతో నేరుగా రైస్‌మిల్లుల్లో విక్ర యించేందుకే మొగ్గు చూపుతున్నారు. ముందస్తు కోతల సమయంలో క్వింటా ల్ రూ.2,500 వరకు కొనుగోలు చేసిన మిల్లర్లు..

20 రోజుల్లోనే క్వింటాల్‌కు రూ.300 వరకు తగ్గించారు. దీనికి తోడు ట్రాక్టర్‌కు 30 కిలోల తరుగు, గుమస్తా రుసుం, హమాలీ ఛార్జీల పేరుతో రూ.3 వేల నుంచి 5 వేలు కోత పెడుతున్నారు.గతంలో కొన్ని మిల్లుల్లో వేబ్రిడ్జిల్లో తూకం మోసాలు సైతం వెలుగులోకి వచ్చాయి. ప్రసుత్తం మిల్లర్లు భారీగా ధాన్యం కొనుగోలు చేస్తున్నా తూనికలు, కొలతల అధికారులు కాంటాలను తనిఖీలు చేసిన దాఖలాలు జిల్లాలో కనిపించడం లేదు.

ప్రభుత్వం సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.2,320, దొడ్డు రకానికి రూ. 2300గా మద్దతు ధర నిర్ణయించింది. సన్నాలకు క్వింటాల్‌కు రూ. 500 బోన స్ ప్రకటించింది. ఈ లెక్కన సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాకు రూ.2, 820 దక్కాల్సి ఉంది. కానీ, మిల్లర్లు రూ.2,300 మించి కొనడం లేదు. ఇక దొడ్డు రకాలకు 1800 చెల్లిస్తుండడంతో క్వింటాకు రైతులు రూ. 500పైగా నష్టపోతున్నారు. 

మద్దతు ఇప్పించండి

మిర్యాలగూడలో మిల్లర్లు సిండికేట్‌గా మారి ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకే కొంటున్నారు. సన్నాలకు మద్దతు ధర రూ.2,320తోపాటు రూ.500 బోనస్ చెల్లిస్తామని చెప్పింది. కానీ, ప్రస్తుతం కేంద్రాల్లో సన్నాలు అమ్మే పరిస్థితి లేదు. 17 తేమ శాతం వచ్చేలా ధాన్యాన్ని ఎండబెట్టడం కష్టం.

అందుకే మిల్లర్లను ఆశ్రయిస్తున్నాం. నేను మిర్యాలగూడకు 9 ట్రాక్టర్లలో 280 క్వింటాళ్ల ధాన్యం తెస్తే క్వింటాల్‌కు రూ. 2,250 ఇచ్చారు. కొనుగోళ్లను పర్యవేక్షించే స్థితిలో అధికారులు లేకపోవడం దురదృష్టకరం. నాలాంటి కౌలు రైతులకు ఇది మరింత నష్టం. 

 మజ్జిగపు వెంకట్‌రెడ్డి,

త్రిపురారం, రైతు 

అంతటా ఒకటే రేటు 

నేను 20 క్వింటాళ్ల ధాన్యం రూ. 2,300లకే అమ్ముకున్న. ఎన్ని మిల్లులు తిరిగినా అంతటా ఒకటే రేటు చెప్పారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లలేక తప్పనిసరి పరిస్థితుల్లో మిల్లులో అమ్ముకోవాల్సి వచ్చింది. గతేడాది ధరతో పోలిస్తే ఈసారి క్వింటాకు రూ.300 నుంచి 400 వరకు తగ్గించారు. కోతల ప్రారంభంలోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మరో 20 రోజుల్లో పరిస్థితిని ఊహించేందుకే కష్టంగా ఉంది. మిల్లర్లను ప్రభుత్వం కట్టడి చేయాలి. 

 చెవుల వెంకన్న, రైతు, 

తిమ్మారెడ్డిగూడెం, వేములపల్లి