calender_icon.png 3 April, 2025 | 1:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోళ్లకు మిల్లర్లు సహకరించాలి

26-03-2025 01:47:08 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ, మార్చి 25 (విజయక్రాంతి) :  యాసంగి ధాన్యం కొనుగోళ్లకు  రైస్ మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, వ్యవసాయ, అనుబంధశాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. మిల్లర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

గత అక్టోబర్ నుంచి నేటి వరకు పెండింగ్ రవాణా బిల్లులు రూ.1400 కోట్లు  చెల్లించినట్లు తెలిపారు. మిగిలిన మొత్తం దశలవారీగా చెల్లిస్తుందన్నారు. మిల్లుల వారీగా పాతగన్నీ బ్యాగుల సమాచారం సేకరించాలని ఇన్చార్జి జిల్లా పౌర  సరఫరాల ఆధికారిని ఆదేశించారు. మిల్లర్లు నిబంధనల ప్రకారం రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించాలని, మిర్యాలగూడలో వెంటనే  కొనుగోళ్లు, ఆన్లోడ్  ప్రారంభించాలని చెప్పారు.

కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు ధాన్యం వస్తే టెక్నికల్ పర్సన్తోపాటు, హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని  చెప్పారు. అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్,  పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఇన్చార్జి డీఎస్‌ఓ హరీశ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, మార్కెటింగ్ శాఖ ఏడీ ఛాయాదేవి, డీఆర్డీఓ శేఖర్ రెడ్డి, జిల్లా రైస్ మిల్లర్ల సంఘం  అధ్యక్ష, కార్యదర్శులు, మిర్యాలగూడ, చిట్యాల, హాలియా, నల్లగొండ, దేవరకొండ ప్రాంతాల మిల్లర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.