- సివిల్ సప్లయ్ సంస్థతో ఒప్పందం చేసుకోని వైనం
- మంచిర్యాల జిల్లాలో 54 మిల్లులు
- 11 మిల్లులకు అధికారుల ట్యాగింగ్
మంచిర్యాల, నవంబర్ 18 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సాధ్యమయ్యేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో 1,60,605 ఎకరాల్లో వరి సాగవగా 3,68,140 మెట్రక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయాధికారులు అంచనా వేశారు.
జిల్లాలో ఏర్పాటు చేసిన 326 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొని చేసి మిల్లులకు పంపించాల్సి ఉండగా ఇంత వరకు ఒక్క మిల్లు యాజమాన్యం కూడా దించుకుంటామని సివిల్ సప్లయ్ సంస్థతో ఒప్పందం చేసుకోలేదు. కానీ పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం 11 మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చారు.
దీంతో అసలు కొనుగోల్లు జరుగుతాయా అనే ఆందోళన రైతుల్లో మొదలైంది. ఇటీవలే జిల్లా స్పెషలాఫీసర్ క్రిష్ణ ఆదిత్య కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. అయినా ఇప్పటి వరకు కొనుగోల్లు జరుపడంతో అధికారులు మిన్నకుండిపోతున్నారు.
ముందుకురాని మిల్లర్లు
జిల్లాలో 54 (19 బాయిల్డ్, 35 రా రైస్) మిల్లులు ఉన్నాయి. కానీ ఒక్క మిల్లర్ కూడా ధాన్యం దింపుకునేందుకు ముందుకు రాలేదు. మిల్లర్ సివిల్ సప్లయ్ సంస్థతో అగ్రిమెంటు చేసుకుంటేనే ఆ మిల్లుకు ధాన్యం పంపించాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క మిల్లు యజమాని కూడా అగ్రిమెంటు ఇవ్వలేదని తెలిసింది. అందుకోసమే ధాన్యం మిల్లులకు తరలించకుండా కల్లాలోనే ఉంచుతున్నారనే అనుమానాలు వ్యక్తమవుతు న్నాయి.
మిల్లు సామర్థ్యం ఆధారంగా ఎన్ని మెట్రిక్ టన్నుల ధాన్యం దింపుకుంటారో ఆ ధాన్యం విలువలో పది శాతం బ్యాంకు గ్యారంటీ సివిల్ సప్లయ్‌కి ఇవ్వాల్సి ఉంటుంది. కాగా ఇంత వరకు ఏ ఒక్క మిల్లర్ ఇచ్చేందుకు ముందుకు రాలేదు. కొంత మంది 25 నుంచి 50 శాతం మాత్రమే దింపుకుంటామంటున్నారు తప్పా అగ్రిమెంటు చేసుకోవడం లేదని కొందరు మిల్లర్లే చెబుతున్నారు.
11 మిల్లులకు ట్యాగింగ్ ఇచ్చిన అధికారులు
జిల్లాలో 326 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించిన సివిల్ సప్లయ్ అధికారులు 11 మిల్లులకు 303 ధాన్యం కొనుగోలు కేంద్రాల(పీపీసీల)ను ట్యాగింగ్ చేశారు. అంటే ఒక్కో మిల్లుకు 25 పీపీసీలను ట్యాగింగ్ ఇస్తే మిల్లుల్లో దింపుడు సాధ్యపడుతుందా అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పీపీసీల నుంచి ధాన్యం మిల్లులకు వెళ్తే అది మిల్లర్లకు వరంలా మారుతుందనడంలో ఎలాంటి సందేహం ఉండదు. ఇదే అదనుగా లారీకి ఐదు క్వింటాళ్లు, పది క్వింటాళ్లు కటింగ్ ఒప్పుకున్నోళ్ల లారీ దింపుతామని పేచీలు పెట్టడం షురూ చేసేందుకే ఇలా ట్యాగింగ్ ఇచ్చారని పీపీసీల ఇన్‌చార్జిలు వాపోతున్నారు. మరోవైపు అగ్రిమెంటు ఇవ్వని మిల్లులకు ధాన్యం పంపిస్తే తర్వాత అగ్రిమెంటు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటో అధికారులకే తెలియాలి.
కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం
ఇంత వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రాత్రి, పగలు పొలాల్లో ధాన్యం వద్ద కాపలా ఉంటున్నాం. పండించినన్ని రోజులు పొలంలో కష్టపడ్డాం. పంట చేతికి వచ్చాక అమ్ముకునేందుకు అరిగోస పడుతున్నాం. అధికారులు ఇప్పటికైనా స్పందించి కొనుగోళ్లు చేపట్టాలి. లేదంటే కలెక్టరేట్‌ను ముట్టడిస్తాం.
కొట్రంగి తరుణ్, రైతు సంక్షేమ సమితి జిల్లా అధ్యక్షుడు, మంచిర్యాల