- పీడీఎస్ బియ్యం పక్కదారి
- పోలీసులు దాడులు చేస్తున్న ఆగని వ్యాపారం
సిరిసిల్ల, నవంబర్ 30 (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లాలో రేషన్ బియ్యం దందా యథేచ్ఛగా కొనసాగుతున్నది. లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొని, మిల్లులో రూ.20 నుంచి రూ.25 వరకు కిలో చొప్పున విక్రయిస్తున్నారు. జిల్లాలో కొంత మంది మిల్లర్లే ఈ దందా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి.
పలుమార్లు పోలీసులు దాడులు చేసి పట్టుకున్నా వ్యాపారం మాత్రం మానడం లేదు. రూ.లక్షల్లో లాభాలు వస్తుండటంతో ఈ దందాను వ్యాపారులు వదులుకోవడం లేదు.
రీ సైక్లింగ్ చేసి ప్రభుత్వానికి..
జిల్లాలో 4 లక్షల 97 వేల 106 మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతి నెల రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వం ఉచితంగా 32,43,212 కిలోల రేషన్ బియ్యం పంపిణీ చేస్తున్నది. ఇలా పంపిణీ చేసే బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేసి, మిల్లులకు తరలించి, రీ సైక్లింగ్ చేస్తున్నారు.
ఇప్పటికే జిల్లాలో మిల్లర్లకు సీఎంఆర్ బియ్యంను ప్రభుత్వానికి అప్పగించేందుకు ఈ నెలాఖరు వరకు అధికారులు గడువును విధించారు. ఇప్పటికే కొందరు మిల్లర్లు ప్రభుత్వానికి ఇచ్చే వడ్లు లేకపోవడంతో రేషన్ బియ్యం కొనుగోలు చేసి, ప్రభుత్వానికి అప్పగించాలనే ఉద్దేశంతో రేషన్ బియ్యం వ్యాపారానికి తెరలేపారు.
జిల్లాలో ముస్తాబాద్, గంభీరావుపేట, సిరిసిల్ల, కోనరావుపేట, వేములవాడ, తంగళ్లపల్లి గ్రామాల్లో ఎక్కువగా రైస్ మిల్లులు ఉండటంతో ఈ ప్రాంతాల్లోని మిల్లులకు రేషన్ బియ్యం ఎక్కువగా సరఫరా అవుతున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడి నుంచే కాకుండా హుజురాబాద్, జమ్మికుంట ప్రాంతాల నుంచి కూడా ఈ మిల్లులకు రేషన్ బియ్యం తీసుకువస్తున్నారని సమాచారం.
డీలర్లతో మిల్లర్ల దోస్తీ!
మరో అడుగు ముందుకు వేసిన మిల్లర్లు రేషన్ డీలర్లతో కలిసి బియ్యాన్ని కొని నేరుగా మిల్లులు తరలిస్తూ దందా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలోని ఓ మిల్లుకు హుజురాబాద్ లాంటి ప్రాంతానికి వెళ్లే రేషన్ బియ్యం లారీ రేషన్ దుకాణాలకు వెళ్లకుండా మిల్లుకు వెళ్తుందనే ఆరోపణలు ఉన్నాయి. ఆ మిల్లు యజమాని అనతి కాలంలోనే కోట్లకు పడగెత్తారని బహిరంగంగానే స్థానికులు చర్చించుకుంటున్నారు.
బియ్యం పక్కదారి పట్టిస్తే చర్యలు
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తూ, పక్కదారి పట్టిస్తే ఉపేక్షించేది లేదు. చట్ట వ్యతిరేక, అసాంఘిక కార్యకలపాలను అరికట్టేందుకు నిఘా ఏర్పాటు చేశాం. స్పెషల్ డ్రైవ్‌లు చేస్తూ, విస్తృత స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నాం. పీడీఎస్ బియ్యం పక్కదారి పట్టిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవు.
అఖిల్ మహాజన్,
ఎస్పీ, రాజన్న సిరిసిల్ల