01-03-2025 09:42:45 PM
పత్తి వాహనాన్ని నిర్బంధించిన మిల్లు నిర్వాహకులు
అసహనంతో రైతు ఆత్మహత్యా యత్నం
చెన్నూరు,(విజయక్రాంతి): మండలంలోని ఒక పత్తి మిల్లులో నిర్వాహకులు తూకంలో చేస్తున్న మోసాన్ని పసిగట్టిన రైతును, అమ్మేందుకు తీసుకువచ్చిన పత్తి వాహనాన్ని రోజంతా నిర్భందించిన ఘటన చెన్నూర్ మండలంలోని ఎల్లక్కపేట గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు జక్కుల రవి తెలిపిన వివరాల ప్రకారం... పత్తిని అమ్ముకునేందుకు రవి శుక్రవారం రోజున చెన్నూరు పట్టణంలోని ఒక మిల్లుకు వెళ్లి తూకం వేయించగా 44.65 క్వింటళ్లు బరువు రాగా మిల్లు యజమాని మద్దతు ధర తక్కువ ఇస్తాను అనడంతో సదరూ రైతు ఎల్లక్కపేటలోని ఆదిశంకరాచార్య మిల్లుకు పత్తిని తీసుకెళ్లారు. పత్తి మిల్లు వద్ద కాంటా వేయగా క్వింటాల్ నర తక్కువ రాగా మిల్లు యజమానిని రైతు రవి నిలదీశారు. కాంటాల్లో వచ్చిన తేడా విషయంలో మిల్లు యజమానికి రైతుకు మధ్య వాదనలు జరిగాయి. కాంత తూకం వేసిన రసీదు ఇవ్వాలని మిల్లు యజమాని రైతు పై దాడి చేయడం కాకుండా మిల్లుకు తీసుకొచ్చిన పత్తి వాహనాన్ని బయటకు వెళ్ళనీయకుండా లోపలే ఉంచి తాళం వేశారు.
న్యాయం కోసం ఆత్మహత్య ప్రయత్నం...
రైతు రవిపై దాడి చేసి రెండు రోజులుగా వాహనాన్ని మిల్లులోనే నిర్భందించిన విషయంపై రవి తండ్రి పుల్లయ్య పోలీసులను ఆశ్రయించాడు. విషయాన్ని అధికారులకు తెలియజేసినప్పటికీ స్పందించకపోవడంతో అసహనంతో జక్కుల పుల్లయ్య పోలీసుల ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఇది గమనించిన పోలీసులు పుల్లయ్యను అడ్డుకొని, సీఐ రవీందర్ కు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సీఐ రవీందర్ భాదితులకు న్యాయం చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.