calender_icon.png 22 December, 2024 | 11:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్క్‌నూర్

30-07-2024 12:05:00 AM

ముల్కనూర్ స్వకృషి మహిళా డెయిరీ 22వ వార్షికోత్సవం సందర్భంగా..

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ 2002లో 72 గ్రామాల్లోని 3,600 మంది మహిళా రైతులతో ముల్కనూర్ సహకార (సృకృషి) డెయిరీని ఏర్పాటు చేశారు. సృకృషి మహిళా డెయిరీ కేవలం రూ.2.30లక్షల  వాటా ధనంతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు దేశంలోనే సహకార డెయిరీలకు ఆదర్శంగా నిలుస్తోంది. ప్రస్తుతం డెయిరీ పరిధిలో 203 గ్రామాల్లో 23 వేల మంది సభ్యులు  ఉన్నారు. వారి నుంచి రోజుకు 57 వేల లీటర్ల పాలసేకరణ చేస్తున్నారు.

ఏటా 2.6 కోట్ల లీటర్ల పాలను డెయిరీ సేకరిస్తున్నారు. రోజు 76 వేల లీటర్ల పాలను అమ్ముతున్నారు. ఏటా రూ.167 కోట్లు గడిస్తున్నట్లు డెయిరీ అధ్యక్షురాలు బుర్ర ధనశ్రీ వెల్లడించారు. గత 22 సంవత్సరాల్లో డెయిరీ రూ.168 కోట్ల లాభాలను సభ్యులకు బోనస్ రూపంలో అందించినట్టు తెలిపారు. సభ్యులకు గతేడాది రూ.11కోట్లు, ఈసారి రూ.12 కోట్లు బోనస్ రూపంలో అందించారు. లీటర్ గేదె పాలకు రూ.54, ఆవు పాలకు రూ.43 చెల్లిస్తున్నారు.

అన్ని జిల్లాలకు పాలు

పాలను స్వకృషి డెయిరీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు సరఫరా చేస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఏర్పాటై న మహిళా స్వకృషి డెయిరీ సహకార రంగంలో అగ్రగామిగా నిలుస్తూ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అవార్డులను అందుకుంటున్నది. మహిళలు సంఘటితంగా సాధిస్తున్న విజయాలను, డెయిరీ పనితీరును పరిశీలించిన దేశ, విదేశీ ప్రతినిధులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. 

పాడిరైతులకు సంక్షేమ పథకాలు

పాడి రైతులు కొనుగోలు చేసిన పశువులకు డెయిరీ ప్రమాద బీమా పథకాన్ని అందిస్తున్నది. పాడిపశువు మృతిచెందితే అం దుకు డెయిరీ రూ.20 వేల బీమాను అందిస్తోంది. డెయిరీ రైతులకు 50 శాతం సబ్సిడీ కింద వైద్యం కోసం మందులను అందిస్తున్నది. గడ్డి గింజలు, దాన బస్తాలు సబ్సిడీ రూపంలో అందిస్తున్నది. సభ్యులు చనిపోతే తక్షణమే రూ.5 వేల సహాయం, తదుపరి వారి కుటుంబసభ్యలకు రూ.30 వేల ఆర్థిక సహాయం అందిస్తున్నది. ఏదైనా ప్రమాదంలో చనిపోయిన సభ్యుల కుటుంబానికి రూ.లక్ష అందిస్తున్నది.

రేపు డెయిరీ 22వ వార్షిక మహాసభ

ముల్కనూర్ స్వకృషి మహిళా డెయిరీ 22వ వార్షిక మహాసభ బుధవారం డెయిరీ ప్రధాన ప్రాంగణంలో జరుగునున్నట్టు డెయిరీ జనరల్ మేనేజర్ మార్పాటి భాస్కర్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల మహిళా సభ్యులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మహాసభలో డెయిరీకి ఎక్కువ పాలు పోసిన సంఘాలకు అవార్డులు అందించనున్నట్లు తెలిపారు.

స్వకృషి డెయిరీ ఉత్పత్తులు

ఈ డెయిరీ సభ్యుల ద్వారా సేకరించిన పాలతో వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తుల ను తయారుచేసి అందిస్తున్నారు. వాటిలో పెరుగు, మజ్జిక, స్లిమ్ మిల్క్, టోన్డ్‌మిల్క్, స్టాండర్డ్‌మిల్క్, గోల్డ్‌మిల్క్‌తో పాటు ఐదురకాల స్వీట్లు వినియోగదారులకు అందిస్తున్నారు.

దేశానికే రోల్‌మోడల్ మన ముల్కనూర్

కరువు నేలపైన పాడి వెల్లువతో ఆదర్శంగా నిలిచారు మహిళా రైతులు. మెట్ట ప్రాంతం కావడంతో ఇక్కడి రైతులు నీళ్లు లేక వ్యవసాయం చేయలేని పరిస్థితుల్లో 

మహిళలంతా సంఘటితమై పాల వెల్లువ సృష్టించారు. ఏటా రెండు కోట్ల డ్బ్బు ఐదు లక్షల డ్బ్బు ఏడు వేల రూపాయల పాల విక్రయాలు జరుపుతూ.. రూ.కోట్లలో లాభాలు గడిస్తున్నారు. నేడు దేశంలోనే సహకార డెయిరీలకు ఆదర్శంగా నిలుస్తున్న ఈ స్వకృషి డెయిరీ ఘనతపై విజయక్రాంతి అందిస్తున్న ప్రత్యేక కథనం.

గౌడ బాలాజీ, భీమదేవరపల్లి