20-02-2025 12:57:38 AM
కామారెడ్డి, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): కామారెడ్డి గాంధారి మండల కేంద్రానికి చెందిన పాల వ్యాపారికి రెండు లక్షల 81 వేల రూపాయలు టోకరా కొట్టారు. తాము గురుకుల పాఠశాలలో ఆర్మీ క్యాంప్ ఏర్పాటు చేశామని, ఆర్మీ పోలీస్ క్యాంపుకు పాలు కావాలని వాట్సాప్ వీడియో ఫోన్ ద్వారా బేరమాడారు,
సదరు పాల వ్యాపా రికి తమకు రోజు ఉదయం 50 లీటర్ల, సాయంత్రం 25 లీటర్లు పాలు కావాలి, నీవు రోజు మాకు పాలు సరఫరా చేయాలని, నీ అకౌంట్లో పంపిస్తామని నమ్మబలికారు, సదరు పాల వ్యాపారికి వాట్సాప్ నుండి గురుకుల పాఠశాల ఫోటోలను పంపిం చారు. ఇక్కడికి పాలు తీసుకురావాలని చెప్పారు,
పాల వ్యాపారి రాత్రి 9 గంటల ప్రాంతంలో పాలు తీసుకుని రెసిడెన్షియల్ పాఠశాల ఆవరణలోకి వెళ్లి ఫోన్ చేయగా వారు నీ యొక్క అకౌంట్ నెంబర్ పంపించు నీకు అడ్వాన్స్ రూ. 60 వేలు పంపిస్తామని నమ్మించారు. పాల వ్యాపారి అతని అకౌంట్ నెంబర్ ఇవ్వగా ఆ అకౌంట్లో కి డబ్బులు ట్రాన్స్ఫర్ కావడం లేదని వేరే అకౌంట్ ఇవ్వాలని కోరారు.
పాల వ్యాపారి అతని కుమారుడి అకౌంటును పంపించారు. కుమారుని అకౌంట్ కు 60 వేల రూపాయలను జమ చేశారు, తర్వాత అకౌంట్ లో డబ్బులు పడ్డాయి అని చూసుకోమని చెప్పారు. కుమారుడు ఫోన్ పే ఓపెన్ చేసి పిన్ నెంబర్ ఎంటర్ చేయగానే ముందుగా 60 వేలు, తర్వాత 99, 60, 62వేలు, నాలుగు విడతలలో అతని అకౌంట్ లోని డబ్బులు ఖాళీ అయ్యాయి, మొత్తం రూ. 2లక్షల81 వేలు ఖాళీ అయ్యాయి, వెంటనే వారు పోలీస్ స్టేషన్లో వెళ్లి ఫిర్యాదు చేశారు.