calender_icon.png 5 December, 2024 | 1:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దక్షిణ కొరియాలో సైనిక పాలన

04-12-2024 12:07:28 AM

ప్రసారమాద్యమాల ద్వారా ప్రకటించిన దేశాధ్యక్షుడు

సియోల్, డిసెంబర్ 3: ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ  దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశంలో ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ను విధిస్తూ ప్రసారమాద్యమాల ద్వారా మంగళవారం ప్రకటన చేశారు. ఉత్తర కొరియాకు అనుకూలంగా పార్లమెంట్‌ను కట్టడి చేసేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఈ సందర్భంగా యోల్ ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లో దేశంలో అత్యవసర పరిస్థితిని విధించాల్సి వస్తోందని వివరించారు.కాగా, వచ్చే ఏడాది బడ్జెట్ బిల్లుపై అధికార యూన్ పీపుల్స్ పవర్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షమైన డెమోక్రటిక్ ఆఫ్ కొరియా మధ్య విభేదాలు వచ్చాయి.

ప్రభుత్వ వ్యయంలో కోత విధించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను స్తంభింపజేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎవ్వరూ ఊహించని విధంగా దేశంలో యోల్ సైనిక ఎమర్జెన్సీని విధించారు. దీంతో పార్లమెంట్‌లో అన్ని రకాల కార్యకలాపాలను నిలిపేస్తున్నట్టు దక్షిణ కొరియా సైన్యం ప్రకటిం చింది. పార్లమెంట్ భవనంలోకి సభ్యులెవరూ వెళ్లకుండా ఆంక్షలు అమలు లోకి వచ్చాయి. దీంతో రాజధాని సియోల్‌లోని పార్లమెంట్ భవనం వద్ద భారీగా భద్రతా దళాలు మోహరించాయి. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పార్ల మెంట్‌లో సమవేశమై నిరసన తెలపాలని డెమోక్రటిక్ పార్టీ తన సభ్యలకు పిలుపునిచ్చింది. దీంతో డెమోక్రటిక్ సభ్యులు పార్లమెంట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా వారిని భద్రతాబలగాలు అడ్డుకున్నాయి. 

ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎమర్జెన్సీ ఎప్పటి వరకూ కొనసాగుతుందనే దానిపై ఆ దేశ అధ్యక్షుడు స్పష్టత ఇవ్వలేదు. చట్టం ప్రకారం పార్లమెంట్‌లో మెజారిటీ ఓటు ద్వారా ఎమర్జెన్సీని ఎత్తేయడానికి వీలుంది. 1980 తర్వాత దక్షిణ కొరియాలో మార్షల్ లాను ప్రకటించడం ఇదే తొలిసారి.