calender_icon.png 18 January, 2025 | 1:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రంప్‌ను కాపాడిన మైగ్రంట్స్!

16-07-2024 02:43:22 AM

  • అక్రమ వలసల లిస్ట్‌కోసం వంగిన ట్రంప్ 
  • లేదంటే ఆయన తలలోంచి బుల్లెట్ దూసుకెళ్లేదే 
  • ప్రచారంలో అక్రమ వలసలపై ట్రంప్ ఆగ్రహం

వాషింగ్టన్, జూలై 15: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను హత్యాయత్నం నుంచి వలసదారులే కాపాడారట. పెన్సిల్వేనియోలో శనివారం ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతుండగా ట్రంప్‌పై ఓ యువకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆయన స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే, బుల్లెట్ దూసుకొచ్చిన సమయంలోనే ఆయన కొద్దిగా కిందికి వంగారు. ప్రసంగంలో భాగంగా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ పాలనలో అమెరికాలోకి ప్రవేశిస్తున్న అక్రమ వలసదారుల డాటా పత్రాలను అందుకొనేందుకు ఆయన ఆ సమయంలో కిందికి వంగినట్టు సమాచారం.

అలా వంగటమే ట్రంప్ ప్రాణాలు కాపాడింది. ఈ విషయాన్ని ట్రంప్ స్వయంగా చెప్పినట్టు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ మాజీ ఫిజీషియన్ ప్రతినిధి రోనీ జాక్సన్ వెల్లడించారు. దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ట్రంప్ తనకు ఫోన్ చేసి ‘ఆ చార్ట్‌కోసం నేను వెళ్లటమే నా ప్రాణాలు కాపాడింది. నేను ఒంగకపోయి ఉంటే బల్లెట్ నా తలలోకి సూటిగా దిగేది’ అని చెప్పినట్టు పేర్కొన్నారు. దీంతో అక్రమ వలసలను ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ.. ఆ ప్రాణాలు నిలబెట్టింది వాళ్లేనని జోరుగా చర్చ జరుగుతున్నది.

అంతా నాటకం

ట్రంప్‌పై కాల్పుల ఘటనపై అమెరికాలో కుట్ర సిద్ధాంతాలు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్నాయి. కొందరు ఆయనకు మద్దతుగా, మరికొందరు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఎన్నికల్లో సింపతీ కోసం ఇదంతా ట్రంప్ ఆడిన నాటకమని కొందరు విమర్శిస్తుండగా, ట్రంప్‌ను చంపేందుకు కుట్ర జరిగిందని మరికొందరు ఆరోపిస్తున్నారు. ‘ఇది చాలా పద్ధతిగా జరిగినట్టు కనిపిస్తున్నది. తుపాకీ శబ్దం నకిలీ గన్ సౌండ్‌లా వినిపించింది.

సభలోని జనం ఎవరూ పరుగెత్తలేదు. ఆందోళన చెందలేదు. నిజమైన తుపాకీ శబ్దం అక్కడివారెవరూ వినలేదు. దీనిని నేను నమ్మను. అతన్ని (ట్రంప్) కూడా నమ్మను’ అని జేన్ ఏర్ అనే ట్వట్టర్ యూజర్ పేర్కొన్నాడు. బుల్లెట్ తదిగి ఆయన ముఖంపై రక్తపు చారికలు మొదట కనిపించినప్పుడు ట్రంప్ వెనుక అమెరికా పతాకం లేదని, ఆ తర్వాత విడుదల చేసిన ఫొటోల్లో అది ప్రత్యక్షమైందని మరికొందరు ట్వీట్లు చేశారు.

బ్యాటిల్ బాక్సుల్లో పరిష్కరించుకొంటాం

ఎన్నికలు సమీపిస్తున్నవేళ హత్యాయత్నం జరిగినా భయపడకుండా రిపబ్లికన్ నేత ట్రంప్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంటే.. డెమోక్రాట్ల అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ ప్రసంగాల్లో తడబడుతూ మరింత నవ్వులపాలవుతున్నారు. ట్రంప్‌పై దాడి జరిగిన తర్వాత బైడన్ అమెరికా ప్రజలను ఉద్దేశించి శనివారం రాత్రి ప్రసంగించారు. ‘మా విబేధాలను బ్యాలెట్ బాక్సుల్లో పరిష్కరించుకొంటాం’ అని చెప్పబోయి.. ‘మా విబేధాలను బ్యాటిల్ (యుద్ధం) బాక్సుల్లో పరిష్కరించుకొంటాం’ అని చెప్పారు. దీంతో ఇప్పటికే ప్రచారంలో వెనుకబడి పోయిన డెమోక్రాట్లు తలలు పట్టుకొంటున్నారు.