- కరీంనగర్ జిల్లాకు ఉత్తరాది కార్మికులు
- ఉపాధి కోసం తరలివస్తున్న వలస జీవులు
- 70 మందికి ఒక బ్యాచ్ చొప్పున పనికి..
- పురుష కూలీలే ఎక్కువ
కరీంనగర్, జూలై 2౪ (విజయక్రాంతి): సాధారణంగా ఏదైనా పరిశ్ర మలో పనిచేసేందుకు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తుంటారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశా, బీహార్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల నుంచి కరీంనగర్‌కు గ్రానైట్ పరిశ్రమ, ఇటుక బట్టీలు, హోటల్ రంగంలో పనిచేసేందుకు వస్తుంటారు. కానీ, గత మూడేళ్లుగా వ్యవసాయ పనుల కోసమే కరీంనగర్ జిల్లాకు పెద్దసంఖ్యలో వస్తున్నారు.
ప్రధానంగా ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల నుంచి దాదాపు ౬ వేల మంది కార్మికులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు వచ్చారు. వరి నాట్లు వేసేందుకు సహజంగా పల్లెల్లో మహిళా కూలీలను ఉపయోగిస్తారు. అయితే, పొరుగు రాష్ట్రాల నుంచి ఎక్కువగా మగ కూలీలే నాట్లు వేసే పనిలో కనిపిస్తున్నారు. 70 మందికి ఒక బ్యాచ్ చొప్పున ఆయా గ్రామాల్లో మకాం వేస్తున్నారు. సూర్యోదయానికి ముందే వరి నాట్లు ప్రారంభిస్తున్నారు.
12 గంటలపాటు పనిలోనే..
నాలుగు రోజుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవడం, వరి మళ్లు వర్షపు నీటితో నిండటంతో నాట్ల జోరు పెరిగింది. జిల్లాలో 2.50 లక్షల ఎకరాల్లో వరి సాగు జరుగుతుందని అధికారులు అంచనా వేశారు. ఇందులో దాదాపు 2 లక్షల ఎకరాల వరకు ఈ వలస కూలీలే నాట్లు వేయనున్నారు. రెండు రోజుల నుంచి నాట్లు జోరుగా సాగుతున్నాయి. సాధ్యమైనంత ఎక్కువ సమయం వరి పొలాల్లోనే ఉంటూ ఎక్కువ డబ్బులు సంపాదించుకుని వెళ్లాలనే ఆతృత వలస కూలీల్లో కనిపిస్తుంది. తెల్లవారుజాము నుంచి చీకటి పడే వరకు దాదాపు 12 గంటలపాటు నాట్లు వేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ వలస కూలీలు వంట సైతం పొలాల వద్దే చేసుకోవడం గమనార్హం.
పలుచోట్ల భూ యజమానులే గ్యాస్‌తోపాటు ఇతర సామగ్రి సమకూరుస్తున్నారు. కూలీకి వచ్చినవారిలో ఒకరిద్దరు వంట పనులు చూసుకుంటున్నారు. ఎకరాకు రూ.4,500 నుంచి రూ.5 వేల వరకు కూలీలకు చెల్లిస్తున్నారు. దీని ద్వారా ఖర్చు కూడా తగ్గుతుందని భూ యజమానులు చెప్తున్నారు. ఖర్చు తగ్గడంతోపాటు పనులు వేగంగా పూర్తికావడం, కూలీల కొరతతో ఇన్ని రోజులు పడ్డ ఇబ్బందులు తొలగిపోవడంతో స్థానిక రైతులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కూలీల్లో ప్రతి బ్యాచ్‌కు ఒక ఆసామి ఉంటున్నాడు. ఈ ఆసామి ఎకరా రేటులో కొంత భాగం తీసుకుంటూ మిగతావి కూలీలకు ఇస్తున్నారు.
ఇబ్బందులు లేకుండా నాట్లు వేస్తున్నారు
వలస కూలీలు ఇబ్బందులు లేకుండా నాట్లు వేస్తున్నారు. నారు చిక్కులను వారే తీసుకుంటున్నారు. దీనివల్ల మాకు పని సులభతరం అయ్యింది. స్థానిక కూలీలు నాటు పూర్తి చేసేందుకు ఎక్కువ సమయం తీసుకుంటారు. దీనికితోడు నారు కూడా మనమే పంచేయాలి. వలస కూలీలతో ఈ సమస్య లేకపోగా ఎరువులు కూడా చల్లుతుండటంతో రైతుకు ఖర్చు తగ్గిపోతుంది.
ముద్దమల్ల వెంకటస్వామి,
రైతు, పాపయ్యపల్లి
ప్రతి సీజన్‌లో వచ్చి నాట్లు వేస్తున్నాం
మాది పశ్చిమ బెంగాల్. మా రాష్ట్రంలో పనులు లేవు. అందుకే ప్రతి సీజన్‌లో ఇక్కడికి వచ్చి నాట్లు వేసి సంపాదించుకుంటున్నాం. ఇక్కడ నాట్లు పూర్తయిన తర్వాత మరో ప్రాంతానికి వెళ్తాం. ఏటా రెండు సీజన్లలో కలిపి ౪ నెలలపాటు పని దొరుకుతుంది. రైతులు కూడా మాతో మంచిగా ఉంటారు.
స్వస్తి, వలస కూలీ, పశ్చిమబెంగాల్
20 మందిమి వచ్చాం
వరినాట్లు వేసేందుకు పశ్చిమబెంగాల్ నుంచి 20 మందిమి వచ్చాం. కూలీ గిట్టుబాటు అవుతుంది. అక్కడ పనులు దొరక్క ఇక్కడికి వస్తున్నాం. మాకు ఇక్కడ పని అయిపోగానే ఇంకో చోటుకు వెళ్తాం. మా ఊరిలో పనిచేస్తే వచ్చే దానికంటే ఎక్కువే సంపాదిస్తున్నాం. రైతులే మాకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు.
సర్కార్, వలస కూలీ, పశ్చిబెంగాల్