calender_icon.png 11 January, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వలస బతుకులు మారేదెన్నడో!

01-12-2024 01:02:02 AM

  1. చెరుకు కటింగ్‌కు వలస వెళ్తున్న గిరిజన కూలీలు
  2. ఉపాధి అవకాశాలు లేక ఉన్న ఊరికి దూరంగా..
  3. ఖాళీ అవుతున్న తండాలు, గ్రామాలు
  4. దశాబ్దాలుగా మారని ఖేడ్ ప్రాంత వలస జీవితాలు
  5. తిరిగి వచ్చేవరకు భరోసాలేని బతుకులు

నారాయణఖేడ్, నవంబర్ 30 : ‘కూలి మస్తుగ దొరుకుతాదని.. కోస్తదేశం పోతివా.. ఎన్నడొస్తవో జాలరి.. పాలమూరు లేబరి’ అంటూ వలస జీవితాలపై కవి ముకురాల రామిరెడ్డి రాసిన హృదయ విదారక గేయం నారాయణఖేడ్ ప్రాంతంలోని గిరిజనులకు సైతం సరిగ్గా సరిపోతుంది.

సంగారెడ్డి జిల్లాలోని నారాయణ ఖేడ్ ప్రాంతం వలసలకు కేరాఫ్‌గా మారింది. చెరుకు కటింగ్ సీజన్ ప్రారంభమయ్యిందంటే చాలు ఈ ప్రాంతం నుంచి వేలాది గిరిజన, పేద కూలీలు బతుకుదెరువు కోసం చెక్కర కర్మాగారాల ఉన్న ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. దశాబ్దాలు గడిచినా ఖేడ్ ప్రాంతంలో ఎలాంటి ఉపాధి అవకాశాలలు లేకపోవడంతో ఇక్కడి ప్రజలకు వలసలు వెళ్లక తప్పడం లేదు.

ఖేడ్ డివిజన్ పరిధిలో 250కి పైగా తండాలు ఉన్నాయి. ప్రతీ తండా నుంచి పదుల సంఖ్యలో కుటుంబాలు దాదాపుగా మూడు నెలలపాటు పిల్లాపాపలు, పశువులను తోలుకొని బోధన్, నిజామాబాద్, జహీరాబద్, తాం డూరు, సంగారెడ్డి, కామారెడ్డి ప్రాంతాల్లోని చక్కెర కర్మాగారాలు ఉన్న ప్రాంతాలకు వెళ్తున్నారు. దీంతో ఆ కాలంలో చిన్న పిల్లలు చదువులకు దూరమవుతున్నారు.

పాలకులు మారినా, ప్రభుత్వాలు మారినా ఖేడ్ ప్రాంత కూలీల బతుకులు మాత్రం మారడం లేదని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నారాయణఖేడ్ నుంచి సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా కూలీలు వలస వెళ్తున్నారు. కర్ణాటకలోని బీదర్, హుమ్నాబాద్, శివ్‌మొగ్గ, హళికేడ్, బీజాపూర్, మహారాష్ట్రలోని నాందేడ్, దెగ్లూర్ ప్రాంతాల్లో చెరుకు కొట్టేది ఖేడ్ ప్రాంత వలస కూలీలే. 

ఖాళీ అవుతున్న తండాలు

ఏడాదికి మూడు నెలలు చెరుకు క్రిషింగ్ కొనసాగుతుంది. ఈ సమయంలో కూలీలు తమ ఇండ్లను వదిలి వెళ్తున్నారు. కొన్ని కుటుంబాల్లో చిన్నారుల ఆలనాపాలన చూసుకునేవారు లేక నెలల వయసున్న పిల్లలను కూడా వెంటబెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. నెలల పాటు ఇంటిముఖం చూడని పరిస్థితులు ఉన్నాయి. దీంతో నియోజ కవర్గాల్లోని తం డాలన్నీ ఖాళీగా బోసిపోతున్నా యి. తమవారు ఎప్పుడొస్తరోనని ఇంటివద్ద ఉన్న కుటుంబ సభ్యులకు ఎదురుచూపులు తప్పడం లేదు.

భరోసా లేని బతుకులు

చెరుకు కొట్టేందుకు వెళ్లిన కూలీల తమ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పనిచేయాల్సి వస్తోంది. వలసల సమయాల్లో పలుమార్లు అనేకమంది కూలీలు ప్రమాదాల బారిన పడటంతో పలు కుటుంబాలు రోడ్డున పడిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. రోడ్డు ప్రామాదాలతోపాటు, ఎడ్ల బండ్లు పల్టికొట్టడం, చెరుకు తోటల్లో పాముకాటుకు గురికావడం, చెరుకు తోటల వద్ద వేసుకున్న గుడిసెలు అగ్ని ప్రమాదాల బారిన పడటం వంటి ఎన్నో దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో వలసలు వెళ్లిన కుటుంబీకులు తమ వారు తిరిగి వచ్చేవరకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తూ ఇళ్ల వద్ద బిక్కుబిక్కు మంటూ గడుపుతున్నారు.

పనులు లేకనే..

స్థానికంగా మాకు పనులు దొరకకనే చెరుకు కొట్టేందుకు పోతున్నం. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ పూర్తయింది. మళ్లీ మిర్గంలో పంట సీజన్ షురువయ్యేదాక ఎలాంటి పని దొరకదు. అప్పటి వరకు పొట్టపోసుకు నేందుకు చాలా కష్టంగా ఉంటుంది.  అందుకే వలస వెళ్తున్నాం. ఈ యేడు మేం సంగారెడ్డి పరిధిలోని సింగూర్‌కు చెరుకు కొట్టేందుకు పోతున్నం.

 హరిశ్చంద్ర నాయక్, 

తడ్కల్ బుస్సి తండా

పరిశ్రమలు పెట్టాలి

ఖేడ్ ప్రాంతంలో పేదల బతుకులు మారాలంటే స్థానికంగా పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం, పాలకులు చర్యలు తీసుకోవాలి. దశాబ్దాలు గడిచినా ఖేడ్ ప్రాంత వలస కూలీల బతుకుల్లో ఎలాంటి మార్పు రాలేదు. యువకులు,  మేధావుల్లో మార్పు వస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

 రహీం,

నేషనల్ హ్యమన్ రైట్స్ స్టేట్ చైర్మన్