calender_icon.png 24 October, 2024 | 7:57 PM

రక్షాపురంలో అర్ధరాత్రి ఉద్రిక్తత

28-08-2024 12:26:48 AM

భూలక్ష్మమ్మ, నల్లపోచమ్మ విగ్రహాల ధ్వంసం

న్యాయం చేయాలని ధర్నాకు దిగిన ఓ వర్గం 

ఒవైసీ బ్రదర్స్ చిచ్చుపెడుతున్నారు: మాధవిలత 

చార్మినార్, ఆగస్టు 27: పాతబస్తీలో సోమవారం అర్ధరాత్రి హిందూ దేవతల విగ్రహాల ధ్వంసంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చాంద్రాయణగుట్ట నియోజకవర్గం రియాసత్‌నగర్ డివిజన్ రక్షాపురం ప్రధాన రోడ్డు మార్గంలో ఉన్న భూలక్ష్మమ్మ ఆలయ తాళా న్ని గుర్తు తెలియని దుండగులు పగులగొట్టి భూలక్ష్మమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్ల విగ్రహాలను ధ్వంసం చేశారు. దీంతో హైదరాబాద్ జిల్లా బీజేపీ ఇన్‌చార్జి సంరెడ్డి సురేందర్‌రెడ్డి, ఆలె భాస్కర్‌రాజ్, తాడెం శ్రీనివాస్‌రావు, పెండెం లక్ష్మణ్, వీరేందర్ యాదవ్, చిరంజీవితో పాటు భారీ సంఖ్యలో హిందువులు అక్కడకు చేరుకుని ఆందోళన చేశారు.

విగ్రహాలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. కృష్ణుడి జన్మాష్టమి రోజునే దుండగులు విగ్రహాలను కూల్చివేయడం వెనక కుట్ర ఉన్నదని ఆరోపించారు. దీంతో సంతోష్‌నగర్‌తోపాటు అదనపు పోలీసు బలగాలను రప్పించి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. టాస్క్‌ఫోర్స్ డీసీపీ వైవీఎస్ సుధీంద్ర, సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్, టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ అందె శ్రీనివాస్, అదనపు డీసీపీ షేక్ జహంగీర్, టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర పరిస్థితిని సమీక్షించారు. మంగళవారం తెల్లవారుజామున బీజేపీ నాయకురాలు మాధవిలత అక్కడకు వెళ్లి నిరసన తెలుపడంతో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. హిందువులు, ముస్లింల మధ్య ఒవైసీ బ్రదర్స్ చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మతిస్థిమితం లేని వ్యక్తి విగ్రహాలను ధ్వంసం చేశాడని, అతడ్ని అదుపులోకి సుకున్నామని పోలీసులు చెప్పారు.