29-03-2025 01:30:46 AM
ఎస్పీ అశోక్’కుమార్
జగిత్యాల, మార్చి 28 (విజయక్రాంతి): జిల్లా వ్యాప్తంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం అర్ధరాత్రి వేళలో భద్రతా బలగాల గస్తీని మరింతగా పెంచామని జగిత్యాల ఎస్పీ అశోక్’కుమార్ పేర్కొన్నారు. గస్తీని మరింత ముమ్మరం చేసి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా బ్లూ కోలడ్స్, పెట్రోకార్ వాహనాలతో అదనంగా నైట్ బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.
గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో ఎస్పీ జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల, మెట్పల్లి ప్రాంతాల్లో పెట్రోలింగ్ వ్యవస్థను స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అర్ధరాత్రి సమయంలో సమర్థవంతమైన పెట్రోలింగ్ ద్వారా ప్రజలో భద్రతాభావం పెంపొందించడం జిల్లా పోలీసుల లక్ష్యం అని రాత్రి సమయంలో నిఘా మరింత పటిష్టం చేస్తూ సమయానుకూల చర్యలు తీసుకోవడం ద్వారా చాలా వరకు నేరాలను నియంత్రించవచ్చన్నారు.
చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, దొంగతనాల నివారణ గురించి పెట్రోలింగ్ వ్యవస్థను మరింత పటిష్ట పరచడం జరిగిందని, దీని ద్వారా జిల్లాలోని ప్రజలు ప్రశాంతంగా ఉండేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఎస్పీ అశోక్’కుమార్ పేర్కొన్నారు.