18-02-2025 11:21:17 PM
సుప్రీంకోర్టు ఆదేశాలను ప్రభుత్వం ఉల్లంఘించింది..
ఎక్స్ వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు..
న్యూఢిల్లీ: అర్ధరాత్రి నూతన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ)గా జ్ఞానేశ్ కుమార్‌ను నియమించడాన్ని లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ తప్పుబట్టారు. సీఈసీ ఎంపికపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగానే నియామకాన్ని చేపట్టడం సరికాదని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ ఎంపికకై జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాలకు తమ అభ్యంతరాలు తెలుపుతూ నివేదిక ఇచ్చినట్టు వెల్లడించారు.
ఎన్నికల సంఘం కమిషనర్, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎంపిక అత్యంత సున్నితమైన అంశమని తెలిపిన రాహుల్.. ఈ విషయంలో కార్యనిర్వహక వ్యవస్థ జోక్యం ఉండదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తూ.. అర్ధరాత్రి వేళ నూతన సీఈసీని ఎంపిక చేసినట్టు వెల్లడించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ నియామకంపై 48 గంటల్లో విచారణ జరగనుండగా.. ఈ సమయంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయం సరికాదన్నారు. కాగా నూతన సీఈసీగా జ్ఞానేశ్ కుమార్, ఎలక్షన్ కమిషనర్‌గా వివేక్ జోషీని నియమిస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం రెండు వేర్వేరు గెజిట్ నోటిఫికేషన్లు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఎవరీ జ్ఞానేశ్ కుమార్..
ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా నియామకమైన జ్ఞానేశ్ కుమార్.. 1988 కేరళ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. గత మార్చిలో ఎన్నికల కమిషనర్‌గా నియామకం అయిన ఆయన.. ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం 2023లో తీసుకొచ్చిన చట్టం ప్రకారం సీఈసీగా ఎంపికైన తొలి అధికారిగా గుర్తింపుపొందారు. 2029 జనవరి 26వ తేదీ వరకు జ్ఞానేశ్.. సీఈసీగా విధులు నిర్వర్తిస్తారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివర్లో బిహార్, వచ్చే ఏడాదిలో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే తదుపరి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలను కూడా ఈయనే పర్యవేక్షించనున్నారు.
కాగా 2019లో కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు కోసం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లును రూపొందించడంలో జ్ఞానేశ్ కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంశాఖలో అప్పుడు ఆయన సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. ఆ తర్వాత సహకార శాఖ కార్యదర్శిగా పని చేస్తూ 2024 జనవరిలో పదవీ విరమణ చేశారు. కేరీర్ తొలి రోజుల్లో ఆయన ఎర్నాకులం అసిస్టెంట్ కలెక్టర్, అడూరు సబ్ కలెక్టర్‌గా కూడా పని చేశారు. ఆ తర్వాత కేరళ ప్రభుత్వ కార్యదర్శిగా కూడా విధులు నిర్వర్తించారు.