calender_icon.png 28 October, 2024 | 4:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కేంద్రాల్లో ‘దళారులు’ పడ్డారు!

28-10-2024 01:17:47 AM

  1. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు అంతంతమాత్రం
  2. తేమ పేరుతో వడ్ల కొనుగోలుకు నిరాకరణ
  3. ఇదే అదునుగా భావించి మధ్యవర్తుల రంగ ప్రవేశం
  4. సరాసరి కేంద్రాల్లోనే వడ్డు కొంటున్న మిల్లర్లు
  5. అటువైపు కన్నెత్తి చూడని అధికారులు

సిరిసిల్ల, అక్టోబర్ 27 (విజయక్రాంతి): ఎన్ని ప్రభుత్వాలు, పాలకులు మారిన రైతు ల బతుకులు మాత్రం మారడం లేదు. ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటను అమ్ముకుని.. నాలుగు డబ్బులు సంపాదించేందుకు ప్రతిసారీ తిప్పలు తప్పడం లే దు.

సిరిసిల్ల జిల్లాలో వానకాలంలో రైతులు పండించిన ధాన్యం ఇప్పటికే దాదాపు చేతికొచ్చింది. ఆ ధాన్యాన్ని విక్రయించేందుకు అన్నదాతలు నానా అవస్థలు పడుతున్నారు. వ్యయప్రయాసల కోర్చి రైతులు కొనుగోలు కేంద్రాలకు  ధాన్యం తీసుకొస్తే, నిర్వాహకు లు తేమ పేరుతో వాటి కొనుగోలుకు నిరాకరిస్తున్నారు.

ఇదే అదునుగా భావించిన దళా రులు రైతులకు మాయమాటలు చెప్పి అడ్డికి పావుశేరు ధరకు ధాన్యం కొనుగోలు చేసి ఉడాయిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లోనే కాంటాలు పెడుతూ ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారు. కొన్నిచోట్ల ఏకంగా మిల్లర్లే  కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చి ధాన్యం కొంటున్నారు.

మరికొందరు రైతులు దిక్కుతోచని స్థితిలో కొనుగోలు కేంద్రాల్లోనే రెండు వారాలుగా పడిగాపులు కాస్తున్నారు. దళారుల దందా బహిరంగంగానే సాగుతున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తిన ట్లు వ్యవహరిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్దకు వచ్చిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాల్సి ఉండగా, దళారులే దర్జాగా ధాన్యం కొనుగోలు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మద్దతు ధరలు.. మోసం ఇలా..

ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు గ్రేడ్ రకానికి రూ.2,320,  గ్రేడ్ బీ రకానికి రూ.2,130 ఉంది. కానీ, సర్కార్ ప్రారంభించిన కేంద్రాల్లో ఇప్పటివరకు కాంటాలు అం తంతమాత్రంగా ప్రారంభమయ్యాయి. ఒకవేళ కాంటాలు ప్రారంభమైనప్పటికీ సిబ్బం ది తేమ సాకుతో ధాన్యం కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారు.

మరోవైపు కొనుగోలు కేంద్రా ల నుంచి సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తీ సుకోవాలని ప్రభుత్వం ఆదేశించినా, మిల్లర్లు అందుకు సహకరించడంలేదు. ధాన్యాన్ని దిగుమతి చేసుకునేందుకు గోదాములు ఖాళీగా లేవని మిల్లర్లు చెప్తున్నారు. అంతేకాదు.. మిల్లులకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

దీంతో  కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ మరింత ఆలస్యమవుతోంది. ఇది ఒకవైపు అయితే.. మరోవైపు మిల్లర్లే కొనుగోలు కేంద్రాల వద్దకు వెళ్లి రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొంటుండడం గమనార్హం. ఇలా మిల్లర్లు, దళారులు ధాన్యంలో 17 శాతం తేమ ఉంటే క్వింటాకు రూ.2,120కే ధాన్యం కొంటున్నారు.

కాంటాలకు పాత కాలపు కాంటాలను ఉపయోగించి రైతులను మోసం చేస్తుండడం సర్వసా ధారణమైంది. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి జిల్లాలో కొనుగోళ్ల ప్రక్రియను పక్కాగా ప్రారంభించి, ధాన్యానికి మద్దతు ధర ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

జిల్లాలో కేంద్రాలు ఇలా..

జిల్లావ్యాప్తంగా 255 పంచాయతీలుండగా, ప్రభుత్వం వాటి పరిధిలో మొత్తం 258 ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసింది. ఇలా ఐకేపీ 44, సింగిల్ విండోల ద్వారా 202, డీసీఎంఎస్ ద్వారా ఎనిమిది, మెప్మా ఆధ్వర్యం లో నాలుగు కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో ఇప్పటివరకు 102 కేంద్రాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

వీటి పరిధిలో ప్రస్తుతం అంతంతమాత్రంగా కొనుగోలు ప్రక్రియ సాగుతున్నది. రైతులు వానకాలంలో జిల్లావ్యాప్తంగా 1.80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈసారి 4.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు.

దీనిలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకు గాను కేంద్రాల్లో 49.97 లక్షల గన్నీ సంచులను అందుబాటులో ఉంచారు. వానలు వచ్చినప్పుడు ధాన్యాన్ని కాపాడుకునేందుకు 7,778 టార్ఫలిన్లను సిద్ధంగా ఉంచారు.