- ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో పలు చెరువులను చెరబట్టిన అక్రమార్కులు
- వెంచర్లు వేసి విక్రయించిన రియల్ వ్యాపారులు
- 12 ఎకరాల చేపల చెరువు కనుమరుగు
రంగారెడ్డి, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): దశాబ్దాలుగా ప్రజలకు సాగు, తాగునీరు అందించిన చెరువులు, కుంటలు రియల్ వ్యాపారుల కన్నుపడి ఆనవాళ్లు కోల్పోతున్నాయి. రాజకీయ పలుకుబడిన కలిగిన నేత లు చెరువులు, కుంటలను చెరబట్టి రియల్ వ్యాపారాలకు తెరలేపారు. ఇదేతీరులో ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలోని మద్దెల చెరువు మాయమైంది. బైరామల్‌గూడలోని సర్వే నంబర్ 16లో 6.25 ఎకరాల లో మద్దెల చెరువు ఉండేది.
ప్రస్తుతం అది తన ఆనవాళ్లను కోల్పోయి దాదాపుగా 2 ఎకరాలకు చేరుకుంది. చెరువులు, కుంటలను పరిరక్షించాల్సిన ఇరిగేషన్, హెచ్‌ఎండీ ఏ అధికారుల ఉదాసీనత కారణంగా ప్రస్తుతం వాటి స్థానంలో కాలనీలు, వ్యాపార సముదాయాలు వెలిశాయి. నిబంధనలకు నీళ్లొదిలి యథేచ్చగా చెరువు లు, కుంటలను ఆక్రమించి రియ ల్ వ్యాపారులు వెంచర్లు చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు. రియల్ వ్యాపారులకు రాజకీయ అండదండలు ఉండడంతో అధికారులు సైతం కిమ్మనకుండా సహకరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరికొందరు అధికారులు అమ్యామ్యాలకు అలవాటుపడి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో ఎల్‌బీ నగ ర్ నియోజకవర్గంలో పలు చెరువులు, కుం టలు అన్యాక్రాంతం అయ్యా యి. దీనిపై నియోజకవర్గంలోని ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఇటీవలనే హైడ్రా అధికారులు నియోజకవర్గంలో పర్యటించారు. మద్దెలకుంట, చేపల చెరువులు సమా కుంటల స్థితగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
12 ఎకరాల్లో వెలిసిన కాలనీలు..
నియోజకవర్గంలోని హస్తినపురం డివిజన్ భూపేష్‌గుప్తానగర్ కాలనీలో కర్మాన్ ఘాట్ గ్రామం సర్వే నంబర్ 58/పీలో గతంలో చేపల చెరువు (సుర్తాన్‌కుంట) 12 ఎకరాల విస్తీర్ణంలో ఉండేది. గత 20 ఏళ్లలో రియల్ వ్యాపారం పుంజుకోవడంతో రియ ల్ వ్యాపారుల కన్ను చెరువులు, కుంటలపై పడింది. రాత్రికి రాత్రే చెరువుల ఆనవాళ్లను తుడిపేసి వాటి స్థానంలో వెంచర్లు వేసి విక్రయాలు జరిపారు.
ఆ స్థలంలో ఐదారు కాలనీ లు వెలిశాయి. అయితే, 1996లో చెరువును కొందరు అక్రమార్కులు పూడ్చివే యడానికి పూనుకోగా స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన అప్పటి కలెక్టర్ సతీశ్‌చంద్ర చెరువును కాపాడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా 2002లో చెరువులో పూడికతీత కోసం అప్పటి మున్సిపల్ కమిషనర్ బహిరంగ ప్రకటన సైతం జారీ చేశారు.
చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో భూపేష్‌నగర్ కాలనీ వాసులకు తాగునీటి అవసరాల నిమిత్తం 2005లో మున్సిపాలిటీ నుంచి 5 బోర్లను సైతం తవ్వించారు. కాగా, కాలక్రమేణా అక్రమార్కులు చెరువును చెరబట్టి తమ పలుకుబడిని ఉపయోగించి చెరువును రికార్డుల్లో లేకుండా ప్రణాళిక ప్రకారం తొలగించారు.
ఎంపీ హోదాలో పర్యటించిన రేవంత్‌రెడ్డి
మూడేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో పలు లోతట్టు కాలనీలు జలమయయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలకు తీవ్ర ఆస్తినష్టం జరిగింది. అప్పుడు మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి ముంపు ప్రాంతా ల్లో పర్యటించి ప్రజలను పరామర్శించారు. ఆ సమయంలో నియోజకవర్గంలోని చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల విషయం వెలుగు చూసింది. ఆక్రమణల కారణంగా వరద నీరు వెళ్లే పరిస్థితి లేక తమ కాలనీలు చెరువులను తలపిస్తున్నాయంటూ ప్రజలు తమ ఆవేదనను రేవంత్‌రెడ్డికి విన్నిపించారు.
దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి ఆక్రమణలకు గురైన చెరువులు, కుంటలను పరిరక్షించాలని అధికారులకు సూచించినప్పటికీ పెడచెవిన పెట్టారు. ప్రస్తుతం సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి ఎల్‌బీ నగర్ నియోజకవర్గంలో అన్యాక్రాంతం అయిన చెరువులు, కుంటలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో ఇప్పుడైన ఆక్రమణల నుంచి మోక్షం లభిస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.