calender_icon.png 5 February, 2025 | 3:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యతరగతి బడ్జెట్

02-02-2025 12:00:00 AM

దేశం యావత్తు ఎంతో ఆదుర్దాగా, ఆసక్తిగా ఎదురు చూసిన కేంద్ర బడ్జెట్  రానే వచ్చింది. బడ్జెట్ అనగానే సామాన్య జీవులంతా కూడా తమపై ఎంత భారం పడుతుందా అనే భయంతోనే గడుపుతుండడం సహజం. గత కొంతకాలంగా ప్రతి బడ్జెట్‌లోనూ పెట్రోల్, డీజిల్‌పై సుంకాలు పెంచడంలాంటివి ఆనవాయితీగా వస్తోంది. పెట్రోలియం ధరలు పెరిగితే సామాన్యడి బడ్జెట్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగాను భారం పడడం ఖాయమనేది అనుభవమే.

అటు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో పాటు పరోక్షంగా అన్ని రంగాలపైనా దీని ప్రభావం ఉంటుం ది. అయితే ఈసారి మాత్రం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యతరగతిపై కరుణ చూపించారు. ఎవరూ ఊహించని విధంగా చరిత్రలో తొలిసారి వేతన జీవులకు రూ.12 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపులు కల్పించారు.గత కొన్నేళ్లుగా ప్రతిబడ్జెట్‌లోనూ కోట్లాది వేతన జీవులు ఆదాయపన్నులో రాయితీల కోసం ఎదురు చూసి చివరికి నిరాశ చెందడం పరిపాటిగా మారింది.

కానీ ఈసారి మాత్రం ఆర్థికమంత్రి వారి మొర విన్నారు. ఈసారి తప్పకుండా ఆదాయం పన్ను రాయితీలు ఉంటాయని గత కొద్ది రోజులుగా మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. అయి తే వారి అంచనాలను మించి ఈ పరిమితిని రూ.12 లక్షల దాకా పెంచారు. ఇది ఊహించని వరమే. ఆదాయం పన్ను చెల్లించే వారిలో వేతనజీవులే ఎక్కువ. ఈ ఒక్క నిర్ణయంతోనే కోటి మంది పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని బడ్జెట్ అనంతరం మీడియా సమావేశంలో నిర్మలమ్మ చెప్పారు.

అంతేకాదు, ప్రతి బడ్జెట్‌లోనూ కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలు ఉండేవి. కానీ ఈసారి నిర్మలా సీతారామన్ ఆ వర్గానికి నిరాశే మిగిల్చారని చెప్పాలి. కార్పొరేట్ పన్నులో ఎలాంటి మార్పులు చేయలేదు సరికదా కార్పొరేట్ రంగాలకు ఎలాంటి వరాలు కూడా ప్రకటించలేదు. దీనికి భిన్నంగా ఉపాధి కల్పనే ప్రధానంగా పేదలు, యువత, అన్నదాత, మహిళలు లక్ష్యంగా పలు చర్యలను ప్రకటించారు.

దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నయిన వ్యవసాయాభివృద్ధితో పాటుగా దిగుబడి పెంపు, గ్రామా ల్లో నిర్మాణాత్మక అభివృద్ధిపై దృష్టి పెట్టినట్లు ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ‘మేకిన్ ఇండియా’ అభివృద్ధి యాత్రలో వ్యవసాయం, ఎంఎస్‌ఎంఈ, పెట్టుబడులు, ఎగుమతులే మన శక్తివంతమైన ఇంజిన్లని పేర్కొన్న ఆర్థికమంత్రి ఆ రంగాలకే పెద్దపీట వేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. 

విమానాశ్రయాలు, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులులాం టి భారీ ప్రాజెక్టులకు గతబడ్జెట్‌లలో ప్రాధాన్యత ఇచ్చిన ఆర్థికమంత్రి ఈ బడ్జెట్‌లో మాత్రం ప్రజల చేతిలో ఎక్కువ సొమ్ము ఉండేలా చూడడంతోపాటు గ్రామీణ, మధ్య తరగతి ప్రజల వినియోగం పెంచడం ద్వారా ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టిపెట్టడం ముదావహం. 

కాగా అన్ని బడ్జెట్‌లలో మాదిరిగానే బడ్జెట్‌లో కూడా ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు పెద్ద పీట వేసే ఆనవాయితీని ఆర్థిక మంత్రి కొనసాగిం చారు. త్వరలో ఎన్నికలు జరగబోయే బీహార్‌పై వరాలవర్షం కురిపించారు. అయితే గతానికి భిన్నంగా గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాలు, డ్రైపోర్టు, మఖాన్ బోర్డు ఏర్పాటులాంటి పథకాలను ప్రకటించడం గమనార్హం. మరో మూడురోజుల్లో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపైనా ఈ వరాల ప్రభావం ఉంటుందని పరిశీలకుల అంచనా.

ఎందుకంటే ఢిల్లీ ఓటర్లలో బీహార్‌కు చెందిన వారు గణనీయమైన స్థాయిలోనే ఉన్నారు.బడ్జెట్ ఎలా ఉందో చెప్పడానికి స్టాక్ మార్కెట్ ఒక గీటురాయి. శనివారం మార్కెట్‌కు సెలవు అయినా బడ్జెట్ నేపథ్యంలో పనిచేసిన స్టాక్‌మార్కెట్ భిన్నంగా స్పందించింది.

మొదట్లో లాభాల్లో మొదలైన సూచీలు నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం మొదలైన తర్వాత నష్టాల్లోకి జారుకున్నా చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి. వినియోగ వస్తువులు, ఆటో, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన షేర్లు మంచి లాభాలు ఆర్జించాయి. బడ్జెట్‌పై ఆయా రంగాల సానుకూల స్పందనకు ఇది సంకేతమనే చెప్పాలి.