భారత్‌లో ఏఐ, క్లౌడ్ సేవల విస్తరణపై ఫోకస్
న్యూఢిల్లీ, జనవరి 7: ప్రపంచ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్‌లో తన క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ సామర్థ్యాలను విస్తరించేందుకు 3 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.25,700 కోట్లు) పెట్టుబడి చేయనున్నట్లు కంపెనీ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. మంగళవారం స్టార్టప్ ఫౌండర్లు, ఎగ్జిక్యూటివ్‌ల సదస్సులో మాట్లాడుతూ మైక్రోసాఫ్ట్ ఒకే దఫాగా ఇంత భారీ పెట్టుబడుల్ని భారత్‌లో చేస్తున్నదన్నారు.
అయితే ఎంతకాలంలో ఈ పెట్టుబడులు చేసేదీ ఆయన వెల్లడించలేదు. అలాగే ఏఐ నైపుణ్యంలో 2030కల్లా ఒక కోటి మందికి శిక్షణ ఇవ్వనున్నట్లు సత్య నాదెళ్ల వెల్లడించారు. మైక్రోసాఫ్ట్ అజూర్ బ్రాండ్‌నేమ్‌తో క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసుల్ని అందిస్తున్నది. ప్రస్తుతం 300 డేటా సెంటర్లతో కూడిన 60కిపైగా అజూర్ రీజియన్లను కంపెనీ నిర్వహిస్తున్నది. సత్య నాదెళ్ల సోమవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సైతం భేటీ అయ్యారు.