ముంబై: ఐపీఎల్ 17వ సీజన్ నుంచి ఇప్పటికే అధికారికంగా నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ సొంతగడ్డపై మ్యాచ్‌కు సిద్ధమవుతోంది. శుక్రవారం వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో ముంబై అమీతుమీ తేల్చుకోనుంది. ప్లేఆఫ్స్ రేసు నుంచి ముంబై ఎప్పుడో వైదొలగడంతో ఆ జట్టుకు ఇది నామమాత్రపు మ్యాచ్ కానుంది. చివరి మ్యాచ్ ఆడుతున్న ముంబై సీజన్‌ను విజయంతో ముగించాలని భావిస్తోంది. మరోవైపు లక్నోకు ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 13 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో లక్నో 12 పాయింట్లతో ఉంది. అయితే ముంబైపై భారీ విజయం నమోదు చేస్తే.. అసాధ్యమైనప్పటికీ ఇతర సమీకరణాలపై ఆధారపడి లక్నో నాలుగో జట్టుగా బెర్త్ దక్కించుకునే స్వల్ప అవకాశముంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడడం లక్నో జట్టును పూర్తిగా ఒత్తిడిలో పడేసింది. నెట్ రన్‌రేట్ విషయంలో బెంగళూరు, ఢిల్లీ కంటే చాలా వెనకబడి ఉన్న లక్నో భారీ విజయం సాధించినా ప్లే ఆఫ్స్ చాన్స్ రావడం కల్లే! బ్యాటింగ్‌లో రాహుల్, స్టోయినిస్, నికోలస్ పూరన్‌లు మాత్రమే రాణిస్తుండగా.. బౌలింగ్ విభాగం మాత్రం పర్వాలేదనపిస్తోంది. ఇక రేసు నుంచి తప్పుకున్న ముంబైకి ఈ మ్యాచ్ నామమాత్రమే.. ఆ జట్టు నుంచి రోహిత్, సూర్య, పాండ్యా, బుమ్రాలు టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో వారి ప్రదర్శన ఎలా ఉంటుందనేది ఆసక్తికరం. వీరిలో బుమ్రా సూపర్ ఫామ్‌లో ఉండగా.. సూర్య పర్వాలేదనిపించాడు. ఇక రోహిత్, పాండ్యాలు మాత్రం సీజన్‌లో దారుణంగా విఫలమయ్యారు. కనీసం చివరి మ్యాచ్‌లోనైనా రాణిస్తారా చూడాలి. బౌలింగ్‌లో బుమ్రా అన్నీ తానై జట్టును నడిపిస్తున్నాడు. సీజన్‌లో ఇరుజట్ల మధ్య జరిగిన తొలి అంచె పోటీలో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.