హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మత్స్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మత్స్యశాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర మత్స్యశాఖ కమీషనర్ ప్రియాంక అలా అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కో-ఆపరేటివ్ సోసైటీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారు పాల్గొన్నారు. సాయికుమార్ చైర్మన్ గా బాధ్యలు స్వీకరించినందుకు జిల్లా స్థాయి అధికారులు ఆయనను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. ఎంతో నమ్మకంగా సీఎం రేవంత్ రెడ్డి తనకి చైర్మన్ పదవి బాధ్యతలు అప్పగించినందుకుగాను పదవికి, మత్స్యశాఖకి ఎలాంటి భంగం కలుగకుండా ఎల్లవేళలా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని మత్స్యశాఖ అధికారులు కూడా నిబద్ధతతో పనిచేసి మత్స్యకారుల అభివృద్ధి, పురోగతికి తోడ్పడాలని ఆదేశించారు. మత్స్యశాఖలో ఎలాంటి అవినీతి జరగకుండా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు. ఎలాంటి అవినీతి లేకుండా ప్రజలకు సక్రమ పరిపాలన అదించడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, అందుకు అధికారులు సైతం సహకరించాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ కోరారు.