calender_icon.png 30 September, 2024 | 6:57 AM

ఫ్యూచర్ సిటీకి మెట్రో

30-09-2024 02:30:46 AM

ఆరు కారిడార్లు.. 116.2 కి.మీ

  1. మెట్రో ఫేజ్-2 డీపీఆర్‌లకు తుదిమెరుగులు
  2. ఐదు కారిడార్లలో డీపీఆర్‌లు సిద్ధం
  3. రెండుమూడు వారాల్లో కేంద్రానికి సమర్పణ
  4. మూడు నెలల్లో ఫోర్త్‌సిటీ రూట్ డీపీఆర్
  5. నింగి నేల భూగర్భంలో మెట్రో రూట్లు
  6. అంచనా వ్యయం రూ. 32, 237 కోట్లు
  7. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనులు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న హైదరాబాద్ మెట్రోరైల్ ఫేజ్-2 పనుల డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ (డీపీఆర్) తుదిదశకు చేరుకున్నా యి. ఇప్పటికే ఎల్‌బీనగర్- మియాపూర్ మధ్య రెడ్, నాగోల్ - రాయదుర్గ్ మధ్య బ్లూ, జేబీఎస్ -ఎంజీబీఎస్ మధ్య గ్రీన్ కారిడార్లలో సేవలందిస్తున్న మెట్రో..

రెండోదశ పనుల డీపీఆర్‌లకు తుది మెరుగులు దిద్దుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆరు కారిడార్లలో రూ.32,237 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో 116.2 కిలోమీటర్ల మేర 65 స్టేషన్లతో మెట్రోను విస్తరించాలని నిర్ణయించింది. మెట్రో ఫేజ్-2 పనులకు సంబంధించిన కీలక అంశాలను హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్) ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి ఆదివారం వెల్లడించారు.

పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో మెట్రో రూట్ల వివరాలు వెల్లడించారు. రెండుమూడు వారాల్లో ఐదు రూట్లకు సంబంధించిన డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని తెలిపారు. ప్రస్తు తం ట్రాఫిక్ అంచనాలకు సంబంధించి హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఏరియాలో హెచ్‌ఎండీఏ సిద్ధం చేస్తున్న కాంప్రెహెన్సివ్ మెబిలిటీ ప్లాన్ (సీఎంపీ) కోసం హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎదురు చూస్తోందని చెప్పారు. రెండో దశలో నింగి (ఎలివేటర్ కారిడార్), నేల (ఎట్‌గ్రేడ్), భూగర్భం (అండర్‌గ్రౌండ్)లో కారిడార్లు ఉంటాయని వివరించారు.  

ఐదు కారిడార్లు.. 76.2 కిలో మీటర్లు

మెట్రో రెండో దశ పనుల్లో భాగంగా ఇప్పటివరకు ఐదు కారిడార్లలో రూ. 24,237 కోట్ల అంచనా వ్యయంతో 76.2 కిలో మీటర్ల మేర విస్తరణకు డీపీఆర్‌లు పూర్తయినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ‘నాలుగో కారిడార్‌లో నాగోల్ నుంచి ఎల్‌బీనగర్, కర్మన్‌ఘాట్, ఒవైసీ హాస్పిటల్, డీఆర్‌డీవో, చాంద్రాయణగుట్ట, మైలార్‌దేవ్‌పల్లి, ఆరాంఘర్, న్యూహైకోర్టు, శంషాబాద్ జంక్షన్ మీదుగా శంషాబాద్ ఆర్జీఐ విమానాశ్రయం వరకు 36.6 కిలోమీటర్లు మెట్రో ఉంటుంది.

ఐదో కారిడార్‌లో రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి బయోడైవర్సిటీ జంక్షన్, ఖాజాగూడ రోడ్, నానక్‌రామ్‌గూడ జంక్షన్, విప్రో సర్కిల్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదుగా కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలో మీటర్లు.. ఆరో కారిడార్‌లో ఎంజీబీఎస్ నుంచి ఓల్డ్ సిటీ మండి, దారుషిఫా జంక్షన్, శాలిబండ జంక్షన్, ఫలక్‌నుమా, సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్ (అరకిలో మీటర్ దూరం నుంచి) మీదుగా చంద్రాయణగుట్ట వరకు 7.5 కిలో మీటర్లు, ఏడో కారిడార్‌లో మియాపూర్ మెట్రో స్టేషన్ నుంచి అల్విన్ క్రాస్‌రోడ్, మదీనాగూడ, చందానగర్, బీహెచ్‌ఈఎల్, ఇక్రిశాట్ మీదుగా పటాన్‌చెరు వరకు 13.4 కిలో మీటర్లు..

ఎనిమిదో కారిడార్‌లో ఎల్‌బీనగర్ నుంచి చింతలకుంట, వనస్థలిపురం, ఆటోనగర్, ఆర్టీసీ కాలనీ మీదుగా హయత్‌నగర్ వరకు 7.1కిలోమీటర్లు ఉంటుంది. ఫోర్త్ సిటీ (బేగరికంచెలోని ఫ్యూచర్‌సిటీ, స్కిల్‌యూనివర్సిటీ)కి మరో రూట్‌లో రూ.8 వేల కోట్లతో 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరణ పనులకు డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. అందుకోసం రెండుమూడు నెలల సమయం పట్టే అవకాశం ఉంది’ అని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఈ కారిడార్లలో ఎక్కువ శాతం ఎలివేటెడ్ కారిడార్‌లోనే మెట్రో విస్తరణ జరుగనుంది. 

అంతర్జాతీయ ప్రమాణాలతో ఫోర్త్ సిటీ మెట్రో 

సీఎం కలల నగరమైన ఫోర్త్‌సిటీ (బేగరికంచెలోని ఫ్యూచర్‌సిటీ, స్కిల్ యూనివర్సిటీ)కి అంతర్జాతీయ ప్రమాణాలతో ఆకర్షణీయంగా మెట్రో రూట్ ఉండేలా రూ.8 వేల కోట్లతో డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. ఓఆర్‌ఆర్ నుంచి పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఎగ్జిట్ల మీదుగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్న రోడ్డుపై రెండుమూడు నెలల్లో డీపీఆర్‌లను పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో కేంద్రానికి సమర్పిస్తామని ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.

పెద్ద గోల్కొండ నుంచి రావిర్యాల ఎగ్జిట్ వరకు ఎలివేటెడ్ కారిడార్, రావిర్యాల్ ఎగ్జిట్ నుంచి స్కిల్ యూనివర్సిటీ వరకు 18 కిలోమీటర్లు ఎట్‌గ్రేడ్ (రోడ్డు నుంచి)లుగా దాదాపు 300 ఫీట్ల గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మధ్య లో నుంచి మెట్రో మార్గాన్ని నిర్మిస్తారు. 

చార్మినార్ పేరిట స్టేషన్లు 

‘హైదరాబాద్ పాత బస్తీకి పూర్వ వైభవం తెచ్చేలా ఎంజీబీఎస్ - చాంద్రాయణగుట్ట మధ్య గల రూట్‌లోని మెట్రో స్టేషన్లకు చార్మినార్, సాలార్‌జంగ్ మ్యూజియం పేర్లు పెట్టాం. వాస్తవానికి సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్‌లకు అరకిలోమీటర్ దూరంలో మెట్రో స్టేషన్లుంటాయి. ఈ రూట్‌లో 103 చోట్ల హెరిటేజ్, మతపరమైన కట్టడాలున్నాయి. వాటి పరిరక్షణకు ఇంజినీరింగ్ ప్రణాళికలను సిద్ధం చేశాం.

అందుకోసం మెట్రో పిల్లర్లను సర్దుబాటు చేస్తాం. ఎంజీబీఎస్‌ొోశాలిబండ మధ్య 60 ఫీట్ల రోడ్డు ఉంది. శాలిబండ గుట్ట మధ్య 80 ఫీట్ల రోడ్డు ఉంది. 100 ఫీట్ల రోడ్డు విస్తరణ చేపట్టబోతున్నాం. మెట్రో స్టేషన్ల వద్ద 120 ఫీట్ల వరకు విస్తరణ జరుగుతుంది. ఈ రూట్‌లో 1100 ఆస్తులు ప్రభావితం అవుతున్నాయి.

400 ఆస్తులకు ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేశాం’ అని ఎన్వీఎస్‌రెడ్డి పేర్కొన్నారు. మున్సిపల్ అడ్మిని స్ట్రేషన్, అర్భన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం దానకిశోర్, సీఎం స్పెషల్ సెక్రటరీ బీ అజిత్‌రెడ్డి, హెచ్‌ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ అమ్రపాలి, సీనియర్ అధికారులు ఈ చర్చలో పాల్గొన్నారు. 

భూగర్భంలో..

రెండో దశ పనుల్లో భాగంగా భూగర్భంలోనూ మెట్రో రూట్ ఉండబోతోంది. కారిడార్-4 (ఎయిర్‌పోర్ట్ మెట్రో కారిడార్)లో నాగోల్ నుంచి శంషాబాద్‌లో ఆర్జీఐ విమానాశ్రయం వరకు ఉం టుంది. ఇందులో 35కిలో మీటర్లు ఎలివేట్ కారిడార్ కాగా.. 1.6 కిలో మీటర్లు భూగర్భంలో వెళుతుంది. ఎయిర్‌పోర్టుకు వెళ్లే రోడ్డు మెలికలుగా ఉండడం, టెక్నికల్ సమస్యలను దృష్టిలో ఉంచుకుని భూగర్భంలో రూట్‌ను కార్గో ఎయిర్‌పోర్టు టెర్మినల్ వరకు ఏర్పాటు చేయబోతున్నారు. ఈ మార్గంలో ఎయిర్‌పోర్ట్ మెట్రో స్టేషన్ సహా 24  స్టేషన్లుంటాయి. 

పాత కారిడార్ల పొడగింపు

ఇప్పటికే ఉన్న ఎల్బీనగర్-మియాపూర్, నాగోల్-రాయదుర్గం, జేబీఎస్-ఎంజీబీఎస్ కారిడార్లను పొడిగించేందుకు డీపీఆ ర్‌లు సిద్ధం చేస్తున్నారు. రెడ్‌లైన్‌ను ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్‌కు, మియాపూర్ నుంచి పటాన్‌చెరుకు విస్తరిస్తారు. బ్లూలైన్‌ను నాగోల్ నుంచి ఎల్‌బీనగర్ వరకు, రాయదుర్గం నుంచి కోకాపేట వరకు పొడిగిస్తారు. గ్రీన్ లైన్‌ను ఎంజీబీఎస్ నుంచి చాం ద్రాయణగుట్ట వరకు పొడిగించనున్నారు. 

హైవేల మీదుగా మెట్రో కారిడార్లు

మెట్రో ఫేజ్-౨ను పలు చోట్ల హైవేల మీదుగా చేపట్టనున్నట్లు ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. గతంలో సీఎం సమీక్షలో నిర్ణయించిన ప్రకారం ఎయిర్‌పోర్టు మెట్రో అలైన్‌మెంట్ ఆరాంఘర్, 44వ నంబర్ జాతీయ రహదారి, బెంగళూరు హైవేలోని న్యూ హైకోర్టు మీదుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకునేలా ఖరారు చేస్తున్నట్లు చెప్పారు,.ముంబై హైవే మీదుగా ఆరో కారిడార్‌లోని మియాపూర్  పటాన్‌చెరు రూట్ విస్తరణ చేపడుతారు. విజయవాడ హైవేపై ఎల్‌బీనగర్ నుంచి హయత్‌నగర్ లైన్ పొడిగించనున్నారు. ఫోర్త్ సిటీ మెట్రో రూట్‌ను ఆర్జీఐ ఎయిర్‌పోర్టు, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఎగ్జిట్ల మీదుగా నిర్మిచబోతున్నారు. అందుకోసం హైవే అధికారులతో మెట్రో అధికారులు చర్చించారు. 

రెండో దశలోని మెట్రో కారిడార్లు

ప్రతిపాదన రూట్ కిలోమీటర్లు స్టేషన్లు

కారిడార్ - 4 నాగోల్-ఆర్‌జీఎఐ 36.6 24

కారిడార్-5 రాయదుర్ంగ-కోకాపేట 11.6 10

కారిడార్-6 ఎంజీబీఎస్-చాంద్రాయణగుట్ట 7.5 6

కారిడార్-7 మియాపూర్-పటాన్‌చెరు 13.4 10

కారిడార్-8 ఎల్‌బీనగర్-హయత్‌నగర్ 7.1 6

కారిడార్-9 ఆర్‌జీఐఏ-ఫోర్త్‌సిటీ 40 9

మొత్తం ఆరు కారిడార్లు 116.2 65