calender_icon.png 26 November, 2024 | 7:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో పయనమెటు?అమ్మేస్తం..

18-05-2024 12:51:26 AM

 * 2026 తర్వాత నిర్ణయం ఎల్ అండ్ టీ అధ్యక్షుడు శంకర్ రామన్ ప్రకటన ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చు: సీఎం రేవంత్ రెడ్డి

మహాలక్ష్మి పథకంతో మెట్రోకు నష్టం

ప్రయాణీకుల సంఖ్య భారీగా తగ్గింది

ఎల్ అండ్ టీ అధికారుల వాదన

హైదరాబాద్ సిటీబ్యూరో, మే 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో ఎన్నికల వేడి తగ్గకముందే మెట్రో వేడి రాజుకుంది. మహాలక్షి పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించటంతో మెట్రోపై తీవ్ర ప్రభావం పడిందని, ప్రయాణీకుల సంఖ్య దారుణంగా పడిపోయిందని ఎల్ అండ్ టీ ప్రెసిడెంట్ శంకర్ రామన్ తెలిపారు. ఇలా అయితే సంస్థను నడుపలేమని చెప్పారు. శంకర్‌రామన్ ప్రకటనపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు.

మెట్రో నిర్వహణ ఇష్టం లేకుంటే ఎల్‌అండ్‌టీ సంస్థ వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. దీంతో మరో అడుగు ముందుకేసిన శంకర్‌రామన్.. ౨౦౨౬ సంవత్సరం తర్వాత హైదరాబాద్ మెట్రో సంస్థలోని తమ వాటాను అమ్మేసే అంశాన్ని పరిశీలిస్తామని ప్రకటించారు. దీంతో హైదరాబాద్ మెట్రో రైల్ పరిస్థితి ఏం కానుందోననే చర్చ మొదలైంది. 

మేడిగడ్డ నుంచి గట్టెక్కేందుకేనా?

ఇటీవల ఉత్తరాఖండ్‌లో ఎల్‌అండ్‌టీ దాదాపు రూ.4 వేల కోట్ల ప్రాజెక్టుకు ఓ టెండర్ దాఖలు చేసింది. తాము పని చేస్తున్న అనేక ప్రాజెక్టుల్లో తమ సంస్థ వైఫల్యం ఎక్కడా లేదని ఆ టెండర్‌లో పేర్కొంది. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న మేడిగడ్డ బరాజ్‌ను నిర్మించింది ఎల్‌అండ్‌టీ సంస్థే. ఈ బరాజ్ కుంగిపోయిన విషయం తెలిసిందే. ఇందుకు కారణం ఎవరనే అంశంపై ఇప్పుడు వివాదం నెలకొన్నది. బరాజ్ కుంగుబాటుకు ఎల్ అండ్ టీ కారణమా? లేక ప్రాజెక్టు ఇంజినీర్లా అనేది స్పష్టత ఇవ్వాలని కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్‌కు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇటీవల లేఖ రాసింది.

ఈ లేఖపై ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంగానీ, కాళేశ్వరం చీఫ్ ఇంజినీర్ గానీ స్పష్టత ఇవ్వలేదు. అయితే, మేడిగడ్డ గండం నుంచి గట్టెక్కి ఉత్తరాఖండ్‌లో టెండర్ దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే ఎల్‌అండ్‌టీ మెట్రోను అమ్మేస్తామనే ప్రకటనలు చేస్తున్నదని అధికారిక వర్గాలు అనుమానిస్తున్నాయి. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మెట్రోలో రద్దీ పెద్దగా తగ్గలేదని, కావాలనే ఎల్ అండ్ టీ ప్రతినిధులు రోజుకో వివాదస్పద ప్రకటన చేస్తున్నారని ఓ అధికారి తెలిపారు.

మేడిగడ్డ బరాజ్‌కు ఎల్ అండ్ టీ సంస్థే మరమ్మత్తు చేయాలని, ప్రభుత్వం నిధులు ఇవ్వదని రేవంత్ సర్కారు ఇప్పటికే ప్రకటించింది. ఎన్వోసీ జారీ చేసే విషయంలో ఎల్ అండ్ టీ లోపాలను కూడా పేర్కొంటామని హెచ్చరించింది. అయితే బరాజ్‌ను తామే మరమ్మతు చేస్తామని గతంలో చెప్పిన ఎల్ అండ్ టీ.. పనులు మాత్రం మొదలుపెట్టలేదు. ప్రభుత్వంపై కోపంతోనే ఎల్ అండ్ టీ సంస్థ మెట్రోను అమ్మేస్తామనే ప్రకటనలు చేస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి.  

ఉచిత బస్సే కారణమా? 

హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థలో ప్రారంభమై నాటి నుంచి నేటి వరకు 54 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చి మెట్రో చరిత్రను సృష్టించింది. నాలుగైదు నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మెట్రో రైలు ఆదాయానికి గండి పడుతుందని ఎల్‌అండ్‌టీ వాదిస్తున్నది. మహిళలు మెట్రో ఎక్కటంలేదని, దీంతో సంస్థ నిర్వహణపై తీవ్ర ప్రభావం పడుతున్నదని తెలిపింది. ప్రభుత్వం మాత్రం ఈ వాదనను తోసిపుచ్చుతున్నది. ఉచిత బస్సు వాడుతున్న మహిళల్లో మెట్రో ఎక్కేవాళ్లు చాలా తక్కువని చెప్తున్నది.