calender_icon.png 18 October, 2024 | 5:17 AM

మెట్రో పొలిస్ హోటల్ సీజ్

18-10-2024 12:12:12 AM

మతపరమైన సమావేశాలకు ఆశ్రయం కల్పించడంపై పోలీసుల చర్యలు 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 17 (విజయక్రాంతి): ఓ వర్గానికి చెందిన వ్యక్తుల మతపరమైన సమావేశాలకు ఆశ్రయం కల్పించినందుకు సికింద్రాబాద్‌లోని మెట్రో పొలిస్ హోటల్‌ను గురువారం పోలీసులు సీజ్ చేశారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ గుడి ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు సలీం సహా 151 మంది మెట్రో పొలిస్ హోటల్‌లో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు.

హోటల్‌లో అక్టోబర్ 1 నుంచి 31వ తేదీ వరకు మోటివేషనల్ స్పీకర్ మునావర్ జమా ఒక సదస్సును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హిందూ మతానికి వ్యతిరేకంగా ఈ సదస్సు ఏర్పాటు చేసి కొందరిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. అతను ఎలాంటి అనుమతులు తీసుకోకుండా హోటల్‌లో మొత్తం 49 రూమ్‌లను తీసుకొని మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చెందిన 151 మంది యువకులతో సదస్సు ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.

మునావర్ జమా రెచ్చగొట్టే ప్రసంగాల వల్లే ఆలయంలో దాడికి పాల్పడ్డానని సలీం అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇప్పటికే మునావర్ జమాతో పాటు మెట్రో పోలీస్ హోటల్ యజమాని అబ్దుల్ రషీద్, హోటల్ మేనేజర్ రెహమాన్‌పై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

మరోవైపు నార్త్‌జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ హోటల్ యజమానులతో సమావేశమయ్యారు. ఇకపై పోలీ సుల అనుమతి లేకుండా ఎలాంటి కాన్ఫరెన్స్‌లు నిర్వహించరాదని సూచించారు. అనుమానిత వ్యక్తులకు హోటల్ రూమ్స్ కేటాయించవద్దని హెచ్చరించారు.