పోలీసుల అదుపులో యజమాని, మేనేజర్
హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 20 (విజయక్రాంతి): సికింద్రాబాద్‌లోని ముత్యాలమ్మ ఆలయంపై దాడి ఘటనలో మెట్రో పొలిస్ హోటల్‌పై గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ముగ్గురిని నిందితులుగా పేర్కొనగా.. వీరిలో మోటివేషనల్ స్పీకర్ మునావర్ జామా, మెట్రో పొలిస్ హోటల్ యజమాని అబ్దుల్ రషీద్, మేనేజర్ రెహమాన్ ఉన్నారు.
అయితే ఆదివారంహోటల్ యజమాని అబ్దుల్ రషీద్, మేనేజర్ రెహమాన్‌లను పోలీసులు ముంబైలో అరెస్ట్ చేశారు. మరో నిందితుడు మునాబర్ జమాను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. కాగా గుడిపై దాడికి పాల్పడ్డ వ్యక్తులు హోటల్‌లో బస చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. దాడికి పాల్పడిన నిందితుడు సల్మాన్ హోటల్‌లో ఉన్నారని పోలీసులు తెలిపారు.
అక్టోబర్ 1 నుంచి 31 వరకు మెట్రో పొలిస్ హోటల్‌లో మునావర్ జామా ఒక సదస్సు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హిందూ మతానికి వ్యతిరేకంగా ఈ సదస్సు ఏర్పాటు చేసి కొందరిని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మొత్తం 151 మందికి ఈ హోటల్ బస కల్పించినట్లు పోలీసులు గుర్తించారు. 49 రూమ్‌లను బుక్ చేశారని, ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మునావర్ జామా సదస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సదస్సుకు మెట్రో పొలిస్ హోటల్ యజమాని సహకరించినట్లు పోలీసులు గుర్తించారు.