calender_icon.png 24 December, 2024 | 7:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెట్రో ఫేస్-2 ఖర్చు తక్కువే!

24-12-2024 12:20:00 AM

  1. చెన్నైలో కిలోమీటర్‌కు రూ.619-756 కోట్లు
  2. ముంబైలో కిలోమీటర్‌కు రూ.543-1,492కోట్లు
  3. హైదరాబాద్‌లో రూ.318 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23(విజయక్రాంతి): చెన్నై, ముంబై, ఢిల్లీ, బెంగుళూరు, కలకత్తా లాంటి ఇతర నగరాలతో పోల్చితే మెట్రో ఫేస్-2లో భాగంగా హైదరాబాద్‌లో హెచ్‌ఏఎంఎల్(హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్)చేపడుతున్న కారిడార్ల నిర్మాణ ఖర్చు చాలా తక్కువగా ఉండబోతోంది.

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2లో కిలోమీటర్‌కు రూ. 318కోట్ల ఖర్చు చేయనుండగా మిగతా రాష్ట్రాల్లో మెట్రో నిర్మాణ వ్యయం రాష్ట్రాన్ని బట్టి కిలోమీటర్‌కు రూ.350కోట్లు, 500కోట్లు, రూ.600కోట్లకు పైగా ఉంది. మొదటి దశలో ఎల్‌అండ్‌టీతో కలిసి పనిచేసిన అనుభవానికి తోడు తక్కువ ఖర్చుతో కారిడార్ల నిర్మాణం చేపట్టేలా హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్(హెచ్‌ఏఎంఎల్) అధికారులు రూపొందించిన ప్రణాళికలు హెచ్‌ఏఎంఎల్‌కు కలిసి వచ్చింది.

కాగా మెట్రో ఫేజ్-2 కోసం రూపొందించిన డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపిన విషయం తెలిసిందే. 

హైదరాబాద్‌లో కిలోమీటర్‌కు రూ.318కోట్ల ఖర్చు

హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 పనుల్లో భాగంగా ఆరు కారిడార్లలో 116.4 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్లను నిర్మించబోతున్నారు. ఐదు కారిడార్లలో 76.4కి.మీ మేర నిర్మించబోయే పనుల కోసం రూ. 24,269 కోట్లతో అంచనాలను రూపొందించారు. కాగా ఫేజ్-1లో భాగంగా ఏడేండ్ల క్రితం చేపట్టిన 69కిలో మీటర్ల కారిడార్ల నిర్మాణం కోసం రూ.22,148 కోట్లు వెచ్చించగా.. ఒక కిలోమీటర్ కారిడార్, స్టేషన్లు, కోసం దాదాపు రూ.320కోట్ల వరకు ఖర్చు వచ్చింది.

కాగా ఫేజ్ -2లో కూడా కిలోమీటర్‌కు రూ.318కోట్లు ఖర్చు చేయబోతుండటం విశేషం. దేశంలోని ఇతర రాష్ట్రాల్లోని మెట్రో కారిడార్ల నిర్మాణంతో పోల్చితే ఈ ఖర్చు చాలా తక్కువ. బెంగుళూరు మెట్రో కిలోమీటర్‌కు రూ.373కోట్ల నుంచి రూ.569కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. చెన్నై మెట్రో రూ.619కోట్ల నుంచి రూ.756కోట్లు, ముంబై మెట్రో రూ.543కోట్ల నుంచి రూ.1492కోట్లు ఖర్చు చేస్తోంది.

అయితే ఈ మెట్రో కారిడార్ల నిర్మించే రూట్‌లలో ఎక్కువగా ఎత్తు పల్లాలు, భూగర్భంలో కారిడార్లను నిర్మిస్తుండటంతో ఈ ఖర్చు పెరుగుతోంది. హైదరాబాద్‌లో మెట్రో ఫేజ్ 2లో భాగంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వద్ద భూగర్భ మార్గాన్ని నిర్మించబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఇక్కడ చేపట్టబోయే అండర్‌గ్రౌండ్ మెట్రో కారిడార్ నిర్మాణానికి కూడా తక్కువ ఖర్చుతోనే చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మెట్రో పిల్లర్ల ఆకృతులు, తదితర అంశాలను ఇంజనీరింగ్ నిఫుణులతో చర్చించి నిర్ణయం తీసుకోబోతోంది. కాగా ఫేజ్-2లో భాగంగా చేపట్టబోయే కారిడార్లలో భూసేకరణకే ఎక్కువ ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే ఫేజ్-1లో ఎల్‌అండ్‌టీతో కలిసి పీపీపీ పద్ధతిలో చేపట్టిన ప్రాజెక్టు ప్రపంచంలోనే అత్యుత్తమ పీపీపీ మెట్రో ప్రాజెక్టుగా నిలవగా.. తక్కువ ఖర్చుతో చేపడుతున్న రెండో దశ మెట్రో కూడా ఆకర్షిస్తుందని మెట్రో అధికారులు చెబుతున్నారు.

ప్రభుత్వ స్థలాల వినియోగంతో ఖర్చు తగ్గింపు

మెట్రో ఫేజ్ -1 నిర్మాణం కోసం ఎల్‌అండ్‌టీ సంస్థ వివిధ బ్యాంకుల నుంచి 10-12శాతం వడ్డీలకు రుణాలను తీసుకుంది. ఫేజ్-2లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో జికా, ఏడీబీ, ఎన్‌డీబీ లాంటి సంస్థల నుంచి 2శాతం వడ్డీకే రుణాలను తీసుకోబోతోంది. ఫేజ్ -1 కోసం రాష్ట్ర ప్రభుత్వం మెట్రోకు ఇచ్చిన భూములను ప్రస్తుతం ఫేజ్-2కు సద్వి నియోగం చేసుకోవడం ద్వారా ఖర్చు ను మరింత తగ్గించుకునే ప్రణాళికలు రూపొందించుకుంటోంది.