- ప్రైవేట్, పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో నిధులు
- జనవరి మొదటి వారంలో పనులు ప్రారంభం
- పాతబస్తీలో రూ.700 కోట్లతో భూసేకరణ
- హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగర పరిధిలో అతితక్కువ ఖర్చుతో మెట్రో ఫేజ్ పనులు చేపడతామని, పనుల ఆమోదం కోసం ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి డీపీఆర్ పంపించామని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్) ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు.
హెచ్‌ఎంఆర్‌ఎల్ ప్రస్థానానికి ఈ నెల 28 నాటికి ఏడేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం ఆయన హైదరాబాద్ లోని మెట్రో కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ప్రైవేట్, పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో జనవరి మొదటి వారంలో పనులు ప్రారంభమవుతాయన్నారు. పాత బస్తీలో రూ.700 కోట్లతో భూసేకరణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.
పనుల్లో కేంద్ర రాష్ట్ర, ప్రభుత్వాల భాగస్వామ్యం ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ పూచీకత్తుతో పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నామన్నారు. ఒకప్పుడు తన దిష్టిబొమ్మలు కాల్చిన వారు కూడా ఇప్పుడు మెట్రో రైలు సౌకర్యం కావాలంటున్నారని సంబురపడ్డారు. మెట్రో రైలు సేవల్లో హైచ్‌ఎంఆర్‌ఎల్ దేశంలోనే మూడో స్థానంలో ఉందని కొనియాడారు.
మెట్రో రైళ్లలో రోజుకు సుమారు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. మెట్రోరైలు విస్తరణ పనులపై ఇప్పటికే తాము ఈ ఏడాదిలో పదిసార్లు సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించామని, మొదటగా ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట (ఓల్డ్ సిటీ) కారిడార్ పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ రూట్‌లో 1,100 నిర్మాణాలు అడ్డు వస్తున్నట్లు గుర్తించామన్నారు.
వాటిలో 106 చారిత్రక, మతపరమైన నిర్మాణాలున్నాయని, ఆ సమస్యలకు ఇంజనీరింగ్ పరిష్కారాలు కనుగొ న్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 800 ఆస్తుల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చామని, 800 ఆస్తుల స్కెచెస్ కలెక్టర్‌కు చేరవేశామన్నారు. మియాపూర్ పటాన్‌చెరు రూట్‌లో మదీనాగూడ వద్ద డబుల్ డెక్కర్ కారిడార్ నిర్మిస్తామన్నారు.
ఈ ఫేజ్‌లో ఆరు కారిడార్లలో 116.4 కి.మీ మేర నిర్మాణం ఉంటుం దన్నారు. ముంబై, బెంగళూరు, చెన్ను నగరాల్లో ఒరూ.50,000 కోట్ల నుంచి రూ.లక్ష కోట్లతో విస్తరణ పనులు జరుగుతున్నాయని, హైదరాబాద్‌లో ఒక కిలోమీటర్ మెట్రో మార్గం నిర్మాణానికి రూ.318 కోట్లు ఖర్చుఅవుతోందన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఈ అం చనా మరీ ఎక్కువగా ఉందని వివరించారు.
సగటు వేగం గంటకు 35 కిలోమీటర్లు
మెట్రో రెండో దశలో రైళ్ల సగటు వేగం గంటకు 35 కిలోమీటర్లు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్వీఎస్‌రెడ్డి తెలిపారు. అందుకు నాగోల్ ఆర్జీఐఏ రూట్‌లో అవసరమైతే నాలుగు స్టేషన్లను తగ్గించే అవకాశం ఉందని వివరించారు. ఎంఎంటీఎస్, ర్యాపిడో, ఆర్టీసీ వంటి రవాణా మార్గాలతో అనుసంధానం చేస్తామని స్పష్టం చేశారు. తొలుత ప్రతి మెట్రో రైలుకు మూడు కోచ్‌లు మాత్రమే ఉంటాయన్నారు. వాటిని దశల వారీగా ఆరు కోచ్‌లకు పెంచుతామన్నారు. తర్వాత ఆరు కోచ్‌లకు తగ్గట్లుగా స్టేషన్లను తీర్చిదిద్దుతామన్నారు.