calender_icon.png 18 January, 2025 | 4:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుండె తరలింపు కోసం మెట్రో గ్రీన్ ఛానల్

18-01-2025 12:47:11 AM

13 నిమిషాల్లో 13 కిలోమీటర్లు దూరంలోని ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17(విజయక్రాంతి): ట్రాఫిక్ నుంచి ఉపశమనం కలిగిస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలను చేర్చుతున్న మెట్రో రైల్ యాజమాన్యం శుక్రవారం తన ఉదారతను చాటుకుంది. నగరంలోని ఓ ఆస్పత్రిలో గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తున్న హృద్రోగి(34)కి హైదరాబాద్ మెట్రో రైల్ ద్వారా శుక్రవారం రాత్రి విజయవంతంగా గుండెను తరలించింది.

మెట్రో అధికారులు తెలిపిన  వివరాలు. యాక్సిడెంట్‌లో బ్రెయిన్‌డెడ్ అయిన ఓ యువకుడి నుంచి జీవన్‌దాన్ ద్వారా సేకరించిన గుండెను ఎల్బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి నుంచి లక్డీకాపూల్‌లోని గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రికి తరలించేందుకు శుక్రవారం రాత్రి 9.30గంటల సమయంలో ఎల్‌అండ్‌టీ మెట్రో ప్రత్యేక గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేసింది. 13కిలోమీటర్లు ..13 నిమిషాల్లో గుండె తరలించింది.

అత్యవసర సేవలకు సహకరించడానికి మెట్రో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. రెండు నెలల క్రితం కూడా గ్లెనీగల్స్ గ్లోబల్ ఆస్పత్రిలోని ఓ హృద్రోగికి కామినేని ఆస్పత్రి నుంచి గుండెను తరలించేందుకు మెట్రో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా వైద్యపరమైన కారణాలతో అది వాయిదా పడింది.