calender_icon.png 9 February, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరులో 50 శాతం పెరిగిన మెట్రో చార్జీలు

09-02-2025 12:55:22 AM

* నేటినుంచే అమలు

బెంగళూరు: బెంగళూరు వాసులకు మెట్రోప్రయాణం ఖరీదు కానుంది. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) టికెట్ ధరలను సవరించింది. పెరిగిన ధరలు ఆదివారంనుంచే అమలులోకి రానున్నాయి. ధరల పెంపుతో పాటుగా ఉబర్, ఓలా తరహాలో పీక్,నాన్‌పీక్ అవర్స్ విధానాన్ని తీసుకువచ్చారు.

బెంగళూరు మెట్రో గరిష్ఠధర ప్రస్తుతం రూ.60గా ఉండగా ఇకపై రూ.90కి పెరగనుంది. సవరించిన ధరలను ఫేర్ ఫిక్సేషన్ కమిటీ గత డిసెంబర్ 16న సమర్పించింది. బీఎంఆర్‌సీఎల్ బోర్డు ఆమోదం మేరకు టికెట్ ధరలు ఫిబ్రవరి 9నుంచి అమలులోకి రానున్నట్లు  సంస్థ తెలిపింది. ఇప్పటికే కర్నాటక ప్రభుత్వం 15 శాతం మేర బస్సు చార్జీలను పెంచిన విషయం తెలిసిందే.

తాజాగా మెట్రో చార్జీలు కూడా పెరుగుతుండడంతో నగర వాసుల ప్రయాణం మరింత భారం కానుంది. దీంతో పాటుగా పీక్ అవర్ టారిఫ్ సిస్టమ్‌ను తీసుకువచ్చారు. ఉదయం రైళ్లు ప్రారంభమైనప్పటినుంచి 8 గంటల వరకు, మధ్యాహ్నంనుంచి సాయంత్రం 4 గంటల వరకు మళ్లీ రాత్రి 9 గంటలనుంచి చివరి వరకు ఆఫ్ పీక్ అవర్స్‌గా నిర్ణయించారు.

అంటే మిగిలిన సమయాన్ని పీక్ అవర్స్‌గా పరిగణిస్తారు.స్మార్ట్ కార్డులపై పీక్ అవర్స్‌లో 10 శాతం, ఆఫ్‌పీక్ అవర్స్‌లో 5 శాతం డిస్కౌంట్ ఇస్తారు.