calender_icon.png 22 February, 2025 | 12:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెటా సాయం కోరిన పోలీసులు

20-02-2025 11:06:47 PM

మహాకుంభమేళా మహిళల స్నానాల వీడియోల విక్రయం..

ఈ నెల 26న ఆకాశంలో అద్భుతం..

ఏడు గ్రహాలను నేరుగా చూసే అవకాశం..

లక్నో: మహాకుంభమేళాలో మహిళల స్నానాలకు సంబంధించిన వీడియోలు విక్రయిస్తున్న రెండు సామాజిక ఖాతాలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళల గోప్యత, గౌరవానికి భంగం కలిగించే వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేయడాన్ని యూపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో వీడియోలు అప్‌లోడ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను గుర్తించేందుకు మెటా సాయం కోరినట్లు పోలీసులు గురువారం వెల్లడించారు.

మరొక టెలిగ్రామ్ చానెల్‌లోనూ ఈ వీడియోలు విక్రయిస్తున్నట్లు తమకు సమాచారం అందినట్లు పోలీసులు తెలిపారు. మహాకుంభమేళాకు సంబంధించి అభ్యంతరకర, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళాలో ఇప్పటివరకు 55 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ముగింపు రోజైన ఫిబ్రవరి 26 నాటికి పుణ్యస్నానాలు ఆచరించే వారి సంఖ్య 60 కోట్లు దాటే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ముగింపు రోజున ఆకాశంలో అద్భుతం..

మహాకుంభమేళాలో ఆఖరి రోజైన ఫిబ్రవరి 26న ఆకాశంలో అద్భుతం చోటుచేసుకోనుంది. అదే రోజు రాత్రి సౌర కుటుంబంలోని ఏడు గ్రహాలు బుధుడు, శుక్రుడు, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ ఒకే లైన్‌లోకి రానున్నాయి. వీటిలో ఐదు గ్రహాలను నేరుగా చూసేందుకు అవకాశముందని.. యురేనస్, నెప్ట్యూన్ దూరంగా ఉండడంతో వాటిని చూడడానికి బైనాక్యులర్లు, టెలిస్కోప్‌లు వాడాలని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ గ్రహాలన్నీ సూర్యుడికి ఒకవైపున చేరి కవాతు చేసే అవకాశముందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. సూర్యుని కక్ష్య ఒకే తలంలో ఉండడం వలన ఆకాశంలో ఈ ఏడు గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు దేశవ్యాప్తంగా ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.