calender_icon.png 7 November, 2024 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పిల్లల ఆహారంతో చెలగాటాలు

20-04-2024 12:05:00 AM

ప్రపంచంలో అతిపెద్ద వినియోగ వస్తువుల తయారీ సంస్థ అయిన నెస్లే మరోసారి వివాదంలో చిక్కుకుంది. భారత్‌లో ఈ సంస్థ విక్రయించే చిన్నారుల ఆహార ఉత్పత్తులయిన సెరెలాక్, నిడో వంటి ఉత్పత్తుల్లో సుక్రోజ్, 

తేనె రూపంలో అధిక చక్కెర కలుపుతున్నట్లు స్విట్జర్లాండ్‌కు చెందిన ఇన్వెస్టిగేటివ్ సంస్థ ‘పబ్లిక్ ఐ’ బయటపెట్టింది. అభివృద్ధి చెందుతున్న ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విక్రయించే బేబీ ఫుడ్స్‌లో చక్కెర శాతాలు అధికంగా ఉండగా, స్విట్జర్లాండ్‌తోపాటుగా యూరోపియన్ మార్కెట్లలో విక్రయించే ప్రాడక్ట్‌లలో చక్కెర శాతాలు లేకపోవడం గమనార్హమని కూడా ‘పబ్లిక్ ఐ’ ఆ నివేదికలో పేర్కొంది. మొన్నటి మొన్న బోర్నవిటా కూడా ఇలాంటి 

వివాదంలో చిక్కుకుంది.

అయితే, గత ఏడేళ్లలో చిన్న పిల్లల ఆహార ఉత్పత్తుల్లో చక్కెర శాతాన్ని 30 శాతం మేర తగ్గించామని కూడా ఆ సంస్థ వివరణ ఇచ్చింది. నాణ్యత, భద్రత, రుచి విషయంలో ఎలాంటి రాజీ పడకుండా చిన్నారుల ఆహార ఉత్పత్తులల్లో చక్కెర శాతాలను మరింత తగ్గించడానికి తాము కృషి చేస్తూనే ఉంటామని నెస్లే ఇండియా ప్రతినిధి ఆ వివరణలో తెలియజేశారు.

ఇది తొలిసారి కాదు

నెస్లే ఇండియా వివాదాల్లో చిక్కుకోవడం ఇది మొదటిసారి కాదు. ఆ సంస్థ ఉత్పత్తి చేసే ప్రధాన ఆహార, బెవరేజ్ ఉత్పత్తుల్లో చాలా భాగం గుర్తించబడిన ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా లేవనే విషయం 2021లో నెస్లే ఇండియా అంతర్గత సమీక్షలో వెల్లడి కావడంతో పెద్ద ఎత్తున ఆందోళన చెలరేగింది. పెంపుడు జంతువుల ఆహారం, బేబీ ఫుడ్ ఫార్ములాలు, కాఫీ మినహా ఇతర ఆహార, బెవరేజ్ ఉత్పత్తుల్లో 60 శాతం ఉత్పత్తులు ఆరోగ్య ప్రమాణాలు కలిగి లేవని ఆ సందర్భంలో నెస్లే అంగీకరించింది. అంతేకాదు, తమ న్యూట్రీషియన్, ఆరోగ్య విధానానాన్ని అప్‌డేట్ చేస్తామని,  పోషక విలువల అవసరాలకు అనుగుణంగా తమ మొత్తం ఉత్పత్తులను సమీక్షించుకుంటామనీ ఆ సందర్భంగా నెస్లే హామీ కూడా ఇచ్చింది. గత ఏడేళ్ల కాలంలో తమ ఉత్పత్తుల్లో చక్కెర స్థాయిలను కనీసం 14-- నుంచి 15 శాతం మేర తగ్గించినట్లు ఆ సంస్థ చెప్పుకుంది. 

మ్యాగీ వివాదం

2015లో నెస్లే పాపులర్ బ్రాండ్లలో ఒకటైన మ్యాగీ నూడుల్స్ నిషేధానికి దారితీసిన వివాదం గుర్తుండే ఉంటుంది.  చిన్న పిలులలు మొదలుకొని పెద్దవాళ్ల దాకా ఎంతో ఇష్టంగా తినే ఈ మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించి సీసం(లెడ్) మోనోసోడియం గ్లూటామేట్ (ఎంఎస్‌జీ) ఉన్నట్లు  బయటపడడంతో ఆ సంస్థ దాదాపు 38,000 టన్నుల మ్యాగీ ఉత్పత్తులను మార్కెట్ నుంచి ఉపసంహ రించుకోవడమే కాకుండా ధ్వంసం చేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న సంజయ్ సింగ్ అనే వ్యక్తి రీటైల్ దుకాణాల్లో రొటీన్ తనిఖీలు జరుపుతున్న సమయంలో మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్ లేబుల్‌పై  ‘ ‘నో యాడె డ్ ఎంఎస్‌జీ’ అని ఉండడం ఆయన దృష్టిని ఆకట్టుకుంది.

దీంతోఆయన మ్యాగీ నూడుల్స్ ప్యాకెట్‌ను గోరఖ్‌పూర్‌లోని రాష్ట్ర ఫోరెన్సిక్ లేబరేటరీకి పరీక్షల కోసం పంపించారు. ఆ నూడుల్స్ ప్యాకెట్లలో (ఎంఎస్‌జి) ఉన్నట్లుగా లేబరేటరీ పరీక్షల్లో వెల్లడయింది. దీంతో కొద్ది నెలల తర్వాత మరింత లోతయిన పరీక్షల కోసం శాంపిల్స్‌ను కోల్‌కతాలోని సెంట్రల్ ఫుడ్ లేబరేటరీ(సీఎఫ్‌ఎల్)కి పంపించారు. దాదాపు ఏడాది తర్వాత 2015 ఏప్రిల్‌లో  సీఎఫ్‌ఎల్ గోరఖ్‌పూర్ ల్యాబ్ నివేదికను ధ్రువీకరించడమే కాకుండా ఈ మ్యాగీ నూడుల్స్‌లో నెస్లే ఇండియా సంస్థ చెప్తున్న దానికన్నా వెయ్యి రెట్లు ఎక్కువ సీసం ఉన్నట్లు కూడా ధ్రువీకరించింది. 

ఈ నివేదిక వచ్చిన తర్వాత కూడా నెస్లే ఇండియా మ్యాగీని వాపసు తీసుకుంటూ ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయడం లేదని, అది తినడానికి సురక్షితమైనదేనంటూ అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఈ వివాదం రానురాను పెద్దది కావడంతో భారత ఆహార భద్రత, స్టాండర్డ్స్‌అథారిటీ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మ్యాగీ నూడుల్స్‌ను మార్కెట్ నుంచి ఉపసంహరించుకోవలసిందిగా నెస్లేను ఆదేశించింది. దీంతో నెస్లేకు మార్కెట్ నుంచి మ్యాగీని ఉపసంహరించుకోవడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది.

జూన్ నుంచి సెప్టెంబర్ ప్రారంభం వరకు దేశవ్యాప్తంగా దుకాణాల నుంచి దాదాపు 38,000 టన్నుల మ్యాగీని ఉపసంహరించుకోవడమే కాకుండా ధ్వంసం చేసింది. ఈ వివాదం కారణంగా భారతీయ స్టాక్ మార్కెట్‌లో మ్యాగీషేరు విలువ 80 శాతం పతనమైంది. దీని ప్రభావం సంస్థపై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపించింది. ప్రభుత్వంతో సుదీర్ఘ చర్చలు జరిపి, సురక్షితమైనదేనని నిర్ధారణ అయిన తర్వాత మ్యాగీ తిరిగి మార్కెట్లోకి వచ్చింది. అయినప్పటికీ, ఈ వివాదం తర్వాత దేశంలో చాలా కుటుంబాలు మ్యాగీని దూరం పెట్టాయి. ఇప్పటికీ ఈ వివాదం ప్రభావం దేశ ప్రజల మనసుల నుంచి పూర్తిగా తొలగిపోలేదు.

బాలకార్మికుల ఆరోపణలు

2011లో నెస్లేపై మరో వివాదం తలెత్తింది. ఐవరీ కోస్ట్‌లోని తమ కోకో పొలాల్లో బాల కార్మికులను ఆ సంస్థ నియమించుకుందని, వారిని బానిసలుగా చూస్తోందని ఓ వెబ్‌సైట్ కథనం పేర్కొంది. దీంతో నెస్లేపై కేసు కూడా నమోదయింది. నెస్లేకు వ్యతిరేకంగా తగిన సాక్ష్యాధారాలు లేవన్న కారణంతో 2012లో అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కేసును కొట్టి వేసింది. ఇక, నెస్లే అనుసరిస్తున్న ప్యాకేజింగ్ విధానాలపై కూడా పర్యావరణ వేత్తల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ కంపెనీ అనుసరిస్తున్న ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడుతున్నాయి. 2025 నాటికల్లా తమ ప్లాస్టిక్ ప్యాకేజింగ్ మెటీరియల్‌లో 95 శాతం రీసైక్లింగ్‌కు వీలు ఉండేలా చూస్తామని నెస్లే హామీ ఇచ్చినప్పటికీ ప్లాస్టిక్ వ్యర్థాలను ఆ సంస్థ తగుల బెట్టడం వల్ల పర్యావరణ కాలుష్యం తలెత్తుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. 

ఇక పాకిస్థాన్‌లో భూగర్భ జలాల మట్టాలు పడిపోవడానికి కూడా నెస్లే కారణమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ సంస్థ కార్యకలాపాల వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవడంతోపాటు కలుషితమవుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. పాకిస్థాన్ సుప్రీంకోర్టుకు సమర్పించిన ఫోరెన్సిక్ ఆడిట్ నివేదికలో సైతం ఈ సంస్థ పెద్ద ఎత్తున నీటి వృథాకు పాల్పడుతున్నట్లు వెల్లడయింది. దీంతో నెస్లే అనుసరిస్తున్న నీటి నిర్వహణ విధానాలపై ఆడిట్ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

కాగా  మిగతా దేశాలకు భిన్నంగా భారత్‌లో నెస్లే విక్రయించే  చిన్న పిల్లల ఆహార  ఉత్పత్తుల్లో అదనంగా చక్కెరను చేర్చుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు  జరపాల్సిందిగా  కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ( సిసిపిఏ) ఫుడ్ రెగ్యులేటర్ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఎస్‌ఎఐని కోరింది.నెస్లేపై వచ్చి న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుని వాటిపై దర్యాప్తు జరపాల్సిందిగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కు లేఖ రాసినట్లు సీసీపిఏ చీఫ్ నిధి ఖరే తెలిపారు.మరో వైపు జాతీ య బాలల హక్కుల పరిరక్షణ జాతీ య  కమిషన్ సౌతం దీనిపై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏకు నోటీసులు జారీ  చేసింది.ఇదిలా ఉండగా  ఈ వివాదాల నేపథ్యంలో శుక్రవారం ఉద యం దేశీయ స్టాక్ మార్కెట్లలో ప్రారంభంలోనే  నెస్లే ఇండియా షేర్లు అమాంతం అయిదు శాతం పడిపోయా యి. అయితే ఆ తర్వాత కొంత మేరకు కోలుకున్నా మ ధ్యాహ్నం దాకా కూడా నష్టాల్లోనే సాగుతూ ఉన్నాయి. గురువారం కూడా నెస్లే షేర్లు నష్టాలను చవి చూశాయి.

తల్లి పాల వ్యతిరేక ప్రచారం

1997లో అమెరికాలో నెస్లేపై మరో దుమారం చెలరేగింది. తమ బేబీ ప్రాడక్ట్‌లను ప్రమోట్ చేసుకోవడం కోసం ఆ సంస్థ తల్లిపాలను నిరుత్సాహ పరుస్తూ ఉందన్న  విమర్శలు వచ్చాయి. ఈ వివాదం ఎంతదాకా వెళ్లిందంటే అమెరికాలో నెస్లే ఉత్పత్తులను బాయ్‌కాట్ చేయాలని పిలుపు నిచ్చేదాకా! అది యూరప్‌కు కూడా పాకింది. 1984 దాకా ఈ వివాదం అలాగే కొనసాగింది. చివరికి నెస్లే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆమోదించిన అంతర్జాతీయ మార్కెటింగ్ కోడ్‌కు కట్టుబడి ఉంటామని హామీ ఇవ్వడంతో  వివాదం సద్దు మణిగింది.

కె.రామకృష్ణ