calender_icon.png 24 December, 2024 | 8:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇళ్లలో గలీజు దందా

06-11-2024 02:14:26 AM

  1. సిద్దిపేటలో నివాస గృహాల్లో కొనసాగుతున్న పేకాట, వ్యభిచారం  
  2. పట్టుబడుతున్న వారిలో రాజకీయ నేతలు, విద్యావంతులు

సిద్దిపేట, నవంబర్ 5 (విజయక్రాంతి): సంపాదన కోసం కొందరు గలీజు వ్యాపారాలు చేస్తున్నారు. పేకాట, వ్యభిచారం నిర్వాహకులకు ఇళ్లలో ఆశ్రయం కల్పిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. సొంత ఇంటిలో గలీజు దందాలకు పూనుకుంటున్నారు.

సిద్దిపేట పట్టణంలో గుట్టుగా సాగుతున్న పేకాట, వ్యభిచారం దందాలను ఇటీవల పోలీసులు బట్టబయలు చేశారు. ఇళ్లలో పేకాట ఆడుతున్న వారిని, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిని పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో రాజకీయ నేతలు, విద్యావంతులు, వ్యాపారులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉండటం గమనార్హం. 

వ్యభిచారం నిర్వహిస్తూ..

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏడాది కాలంలో రెండు ఇళ్లలో వ్యభిచారం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన ఘటనలు ఉన్నాయి. స్థానిక బీజేఆర్ చౌరస్తాలోని ఓ కాలనీలో ఆరు నెలల క్రితం వ్యభిచారం చేస్తున్న వారిని పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేశారు.

ఇటీవల స్థానిక శివాజీ నగర్‌లో ఓ ప్రముఖ వ్యక్తి ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు జిల్లా టాస్క్‌ఫోర్స్, వన్‌టౌన్ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. నలుగురు విటులు, ఒక మహిళ పట్టుబడ్డారు. కానీ, ఇంటి యజమాని పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, నివాసాల మధ్య అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

ప్రముఖులు సైతం 

రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధు లు సైతం పేకాట ఆడుతూ పట్టుబడినట్లు పోలీసులు వెల్లడిం చారు. కౌన్సిలర్, సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీపీ, వివిధ సంఘాల చైర్మన్ల స్థాయిలో పదవులు చేపట్టిన వారితో పాటు పేరొందిన బడా నేతలు పేకాటలో పట్టుబడిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవల సిద్దిపేటలోని ఓ లాడ్జిలో నాయకులు, ఆర్టీసీ ఉద్యోగులు, పోలీసులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. ఆదర్శంగా ఉండాల్సిన వారు ఇలాంటి వ్యసనాలకు పాల్పడుతున్నారు. 

క్లబ్‌ల నుంచి ఇళ్లలోకి

క్లబ్‌లు, పబ్‌ల్లో సాగే పేకాట ఇప్పుడు ఇళ్లలో కూడా సాగుతోంది. సిద్దిపేట పట్టణంలో పలువురు తమ ఇళ్లను పేకాట ఆడుకునేందుకు లీజుకు ఇచ్చి ఆదాయాన్ని గడిస్తున్నారు. పేకాట రాయుళ్లకు అవసరమైన కార్డ్స్, తాగునీరు, పాన్, సిగరెట్లు, మద్యం, భోజనం సైతం అక్కడికే సరఫరా చేయడంతో నిర్వాహకుల కొంత డబ్బు చెల్లిస్తారు.

పేకాట లో ప్రతి రౌండ్‌కు రూ.1000 వరకు వసూలు చేసుకుని ఇంటి యజమాని సొమ్ము చేసుకుంటారు. పోలీసులు పసిగట్టి దాడులు చేయకుండా చూడటం, ఆ ఇంటి సమీపంలో ఎవరైనా కొత్త వ్యకులు కనిపిస్తే వారి వివరాలు తెలుసుకొని అప్రమత్తం చేయడం వంటివి ఒప్పందం చేసుకుంటారు.