calender_icon.png 17 October, 2024 | 8:53 AM

సెయిల్‌లో వైజాగ్ స్టీల్ విలీనం!?

28-09-2024 12:00:00 AM

కేంద్ర ప్రభుత్వం కసరత్తు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: ప్రైవేటీకరణ వివాదంలో నలుగుతున్న వైజాగ్ స్టీల్‌ను మరో ప్రభుత్వ రంగ ఉక్కు కంపెనీ సెయిల్‌లో విలీనం చేసే అంశాన్ని కేంద్ర ప్రభు త్వం పరిశీలిస్తున్నట్లు సంబంధిత వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. వైజాగ్‌లోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) స్టీల్ ప్లాంట్ ఆర్థిక, నిర్వహణా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పరిశీలిస్తున్న మార్గాల్లో సెయిల్‌లో విలీనం చేసే ప్రతిపాదన ఒకటని ఆ వర్గాలు వివరించాయి.

ఆర్‌ఐఎన్‌ఎల్ స్టీల్ ప్లాంట్ కార్యాకలాపాల కొనసాగింపునకు అవసరమైన మూలధనాన్ని సమకూర్చడానికి విశాఖ ఉక్కు భూముల్ని ఎన్‌ఎండీసీకి (నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరే షన్) విక్రయించాలన్న ప్రతిపాదన, బ్యాంక్ రుణాల్ని తీసుకోవాలన్న ప్రతిపాదనలపై కసరత్తు జరుగుతున్నదని వారు వెల్లడించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. 

ఎస్బీఐతో చర్చలు

ఆర్‌ఐఎన్‌ఎల్ అంశంపై ఇటీవల కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి, ఉక్కు మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారులు చర్చించినట్లు సమాచారం. ఆర్‌ఐఎన్‌ఎల్‌కు ఎస్బీఐ అధికంగా రుణాలిచ్చిన బ్యాంక్. విశాఖ ఉక్కు సమస్యకు శాశ్వత పరిష్కారం అందించాలని ప్రభుత్వం కోరుకుంటున్నదని, పలు పరిష్కార మార్గాల్లో సెయిల్‌తో ఆర్‌ఐఎన్‌ఎ ల్‌ను విలీనం చేయడం ఒకటని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

ఉక్కు మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ఆర్‌ఐఎన్‌ఎల్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో 75 లక్షల టన్నుల ఉక్కు ప్లాంట్‌ను నిర్వహిస్తున్నది. సముద్రతీరంలో ఏర్పాటైన తొలి సమగ్ర ఉక్కు ప్లాంట్‌గా దీనికి గుర్తింపు ఉన్నది.  స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) కూడా ఉక్కు మంత్రిత్వ శాఖ అధీనంలోనే ఉన్నది.

విశాఖ ఉక్కుకు చెందిన భూముల్ని ఎన్‌ఎండీసీ ఏర్పాటుచేయనున్న పెల్లెట్ ప్లాంట్‌కు విక్రయిం చడం ద్వారా స్టీల్ ప్లాంట్ కార్యకలాపాలకు నగదు సమకూర్చడం, రుణాల కోసం బ్యాంక్‌లతో చర్చలు తదితర ప్రక్రియలో ప్రస్తుతం ప్రభుత్వం నిమగ్నమై ఉన్నదని ఆ వర్గాలు తెలిపాయి.