- కవిత బెయిల్ కోసం బీజేపీ పెద్దలతో చర్చలు
- కిషన్‌రెడ్డి స్వాగతిస్తుంటే.. బండి వ్యతిరేకిస్తున్నారు
- ఏఐసీసీ అనుమతితోనే కాంగ్రెస్‌లోకి చేరికలు
- పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్
హైదరాబాద్, జూలై 15 (విజయక్రాంతి): బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటేనని పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ విమర్శించారు. బీఆర్‌ఎస్‌ను బీజేపీలో కలిపేస్తామని ఇటీవల ఆ పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని అన్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్‌ను విలీనం చేసేందుకు కేంద్ర మం త్రి కిషన్‌రెడ్డి ప్రయత్నిస్తుంటే.. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడు తూ.. బీఆర్‌ఎస్ నుంచి హరీశ్‌రావును లాక్కొని ఆ పార్టీని చీల్చాలని బండి సంజయ్ చూస్తున్నారని ఆరోపించారు.
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరే ఎమ్మెల్యేలకు ఎలాంటి హామీలుగానీ, డబ్బులుగానీ ఇవ్వడం లేదని స్పష్టంచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలనను చూసే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని తెలిపారు. ఏఐసీసీ అనుమతితోనే చేరికలు జరుగుతున్నాయని చెప్పారు. సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి సీఎంగా కావడం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తట్టుకోలేక ప్రభుత్వం కూలిపోతుందని చెప్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ దళిత ద్రోహి అని, భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షగా ఉంటే కూడా కేసీఆర్ ఓర్చుకోలేదని నిందించారు. టీడీపీ, వైసీసీ, కాంగ్రెస్, సీపీఐ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నప్పుడు బీజేపీ ఎందుకు వ్యతిరేకించలేదని ప్రశ్నించారు.
మోసం చేయడంలో కేసీఆర్ దిట్ట
కేసీఆర్‌కు తెలంగాణపై మొదటి నుంచీ ప్రేమ లేదని, ఎప్పుడు అధికారం వస్తుందనే యావతోనే ఉంటారని మధుయాష్కీ విమర్శించారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ను విలీనంచేస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు. ఇప్పుడు బీజేపీ విషయంలోనూ అదే జరుగుతుందని అన్నారు. కవిత బెయిల్ కోసం బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం చేస్తామని చెబుతున్నారని, బెయిల్ వచ్చాక కథ మళ్లీ మొదటికి వస్తుందని తెలిపారు.
వారు నిరుద్యుగులు కాదు
ఉద్యోగ నియామక పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఎవరూ కోరడం లేదని మధుయాష్కీ అన్నారు. పరీక్షలను వాయిదా వేస్తే రూ.100 కోట్ల వ్యాపారం జరుగుతుందనే ఆలోచనతో కొందరున్నారని ఆరోపించారు. నారాయణ, చైతన్య కాలేజీల్లో హరీశ్, కవితకు 15 శాతం వాటాలు న్నాయని ఆరోపించారు. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కవితకు చెందిన వెలాసిటీ కాలేజీల్లో విద్యార్థుల దొంగ జాబితాతో రూ.వేల కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్ కొల్లగొట్టారని సంచలన ఆరోపణలు చేశారు.
తప్పు లేకపోతే సుప్రీంకు ఎందుకు?
కేసీఆర్ తప్పు చేయకపోతే విచారణ కమిషన్‌ను రద్దుచేయాలని సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లారని మధుయాష్కీ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పని చేసిన అధికారులు కేసుల నుంచి తప్పిస్తే రూ.వందల కోట్లు ఇస్తామని చెబుతున్నారని, కానీ ప్రభుత్వం అవినీతి, అక్రమాలపై నిక్కచ్చిగా విచారణ కొనసాగిస్తుందని తెలిపారు. కార్పొరేషన్ చైర్మన్ల నియామయంలో పార్టీ ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ పాత్ర ఏమీ లేదని, అంతా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎంగిలిమెతుకులు తింటున్న కొందరు బీసీలమని చెప్పుకొని సచివాలయం ముట్టడి చేస్తున్నారని, వాళ్లు నిజమైన బీసీలు కాదని విమర్శించారు.
పీసీసీ పదవి ఇస్తేనే తీసుకుంటా
గత 40 ఏళ్లుగా పార్టీలో వివిధ హోదాల్లో పని చేస్తున్నాని, ఇప్పుడు పీసీసీ పదవి ఇస్తేనే తీసుకుంటానని, వేరే పదవిని తీసుకోనని మధుయాష్కీగౌడ్ స్పష్టంచేశారు. పీసీసీ విషయంలో చర్చే జరగలేదని, కనీసం అభిప్రాయ సేకరణ కూడా జరగలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఎవరిపేరును ప్రస్తావించలేదని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీని ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలని రేవంత్‌రెడ్డే మొదట కోరారని, ఆ తర్వాత సిద్ధరామయ్య అడిగారని తెలిపారు.