calender_icon.png 3 October, 2024 | 5:55 AM

కాసులుంటేనే కారుణ్యం!

03-10-2024 02:56:25 AM

అన్‌ఫిట్ సర్టిఫికెట్ మంజూరుకు లక్షల్లో వసూళ్లు

జెన్‌కో, సింగరేణిలో జోరుగా మెడికల్ దందా

కార్మిక సంఘాల నాయకుల కీలకపాత్ర?

డబ్బులివ్వలేక అవకాశం కోల్పోతున్న అర్హులు

కళ్లుండీ చూడలేకపోతున్న విజిలెన్స్ శాఖ

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 2 (విజయక్రాంతి): తిలాపాపం.. తలా పిడికెడు అన్న చందాన జెన్‌కో, సింగరేణి సంస్థల్లో మెడికల్ అన్‌ఫిట్ సర్టిఫికెట్ల దందా కొనసాగుతున్నది. కొన్నేళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం రద్దు చేసిన మెడికల్ ఇన్వాలిడేషన్ పథకాన్ని గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కారుణ్య నియమాకాల పేరు తో తిరిగి ప్రారంభించింది.

సంస్థ అభివృద్ధి కోసం పనిచేస్తున్న కార్మికులకు ఏమై నా అనారోగ్య సమస్యలు తలెత్తితే మెడికల్ అన్‌ఫిట్ ద్వారా సదరు కార్మికుడి కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇచ్చేందుకు స్వీకారం చుట్టారు. అదే ఆనవాయితీని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోంది. దాన్ని ఆసరాగా చేసుకొని కొంద రు కార్మిక సంఘాల నేతలు దళారుల అవతారం ఎత్తి సంస్థల్లో మెడికల్ దందాకు తెరలేపారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారి పక్కదారి పడుతోంది. పర్యవేక్షణ చేయాల్సిన నిఘా విభాగాలు, యాజ మాన్యాలు మామూళ్ల మత్తులో తూలు తూ దండుకొంటున్నాయనే ఆరోపణలు బహిరంగంగానే విన్పిస్తున్నాయి. సంస్థ నిబంధనల మేరకు అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడే కార్మికులకు మాత్రమే ఈ కారుణ్య నియామకాల స్కీమ్ వర్తిస్తుంది.

కానీ, ఆరోగ్యంగా ఉన్న వారు తమ వారసులకు ఉద్యోగం ఇప్పించాలనే దురుద్దేశంతో చేస్తున్న ప్రయత్నాలతో అర్హులకు త్రీవస్థాయిలో అన్యాయం జరుగుతోంది. ఇల్లెందులో ఈ వ్యవహారం గుట్టుగా సాగుతుందని తెలుస్తోంది. ఇద్దరు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం. ఒక్క సర్టిఫికెట్‌కు రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.  

లక్షలు కొట్టు.. అన్‌ఫిట్ పట్టు

రాష్ట్రానికి వెలుగులు అందించే జెన్‌కో సంస్థల్లోనూ మెడికల్ దందా జోరుగా సాగుతోంది. లక్షలు కొట్టు అన్‌ఫిట్ పట్టు అన్న చందాన టీఎస్ జెన్‌కోలో కారుణ్య నియామకాల విధానం సాగుతోంది. సంస్థలో కారుణ్య నియామకాలు మెడికల్ అండ్ అన్‌ఫిట్ ఉద్యోగం పొందాలంటే వైద్య ధ్రువీకరణ పత్రం నుంచి సీఎండీని మేనేజ్ చేసి ఉంద్యోగంలో చేరేంత వరకు కర్త కర్మ క్రియ మొత్తం కార్మిక సంఘాల నేతలే ప్రధాన పాత్ర, సూత్రదారులుగా చలామణి అవుతున్నారు.

గుర్తింపు పొందిన నాయకులు కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలి ఈ వ్యాపారంలో తలమునకై దండుకొంటున్నట్లు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. విధుల్లో ఉండీ, ఏ కారణంతోనైనా మరణించినా, తీవ్ర అనారోగ్యం పాలైమెడికల్ అన్‌ఫిట్ అయినా కారుణ్య నియామకాల ద్వారా వారుసులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.

ఈ క్రమంలో వారసులకు ఉద్యోగం రావాలంటే దళారులుగా అవతారం ఎత్తిన కార్మిక సంఘాల నాయకులు అడిగినంతా ముట్టచెప్పాల్సిందేనని తెలుస్తోంది. డబ్బులు ఇచ్చే పరిస్థితి లేని కార్మికులు తీవ్ర అనార్యోగంతో బాధపడుతున్నా వారికి అన్‌ఫిట్ సర్టిఫికెట్ రాదు.

విద్యుత్ సౌదా ఉద్యోగులు, మెడికల్ ఆఫీసర్లు, కార్పొరేట్ హాస్పిటల్ వైద్యులు, కార్మిక సంఘాల నేతలు ఓ ముఠాగా ఏర్పడి మెడికల్ అండ్ ఫిట్ దందాను సాగిస్తున్నట్టు తెలుస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న కార్మికుడు మెడికల్ అన్‌ఫిట్ కు రూ.50 వేలు మాత్రమే ఖర్చులు అవుతాయి. కానీ, దళారులుగా వ్యవహరించి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు దండుకొంటున్నారనే ఆరోపణలున్నాయి.

జెన్‌కో వ్యాప్తంగా సుమారు 150 నుంచి 170 వరకు మెడికల్ అన్‌ఫిట్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కేటీపీఎస్ కర్మాగారాల్లో పనిచేసి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండి తిరుగుతున్నా మెడికల్ అన్‌ఫిట్ అయి వారసులకు ఉద్యోగాలు ఇప్పించారంటే ఈ దందాతీరును అర్థం చేసుకోవచ్చు.

కేటీపీఎస్ లో ఫైర్ విభాగంలో పనిచేసిన ఓ ఉద్యోగి, కేటీపీఎస్ ఆసుపత్రిలో పనిచేసిన ఓ ఉద్యోగి, సెంట్రల్ ఆఫీస్‌లో పనిచేసిన మరో మహిళా ఉద్యోగి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా మెడికల్ అన్‌ఫిట్ పొంది వారుసులకు ఉద్యోగం ఇప్పించారు. ఇవి మచ్చుతునకలు మాత్రమే.

క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అనేక ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తాయి. కారుణ్య నియామకాలపై సంస్థల్లో విజిలెన్స్ అధికారులు, యాజమాన్యాలు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తే తప్పా నిజంగా అనారోగ్యంతో భాదపడుతూ అర్హత కల్గిన వారికి న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు కోరుతున్నారు.