calender_icon.png 21 October, 2024 | 4:01 AM

కరుణించని వరుణ

21-10-2024 01:32:28 AM

ఘోర ఓటమిని మూటగట్టుకున్న రోహిత్ సేన

  1. ఖాన్ సాబ్ కొట్లాడినా ఫలితం శూన్యం 

నిండా ముంచిన హెన్రీ, వరుణుడు

గింగిరాలు తిరగని బంతి

* ఓటమనేదే లేదు. మమ్మల్ని ఇండియాలో ఓడించడం అసాధ్యం. ‘మమ్మలెవడ్రా ఆపేది’ అంటూ ఉత్సాహంతో ఉరకలేసిన టీమిండియాకు పెద్ద షాక్. వరుణుడు కూడా కరుణ చూపని వేళ.. కివీస్ చేతిలో దారుణ పరాజయం మూటగట్టుకుంది. సెంచరీతో ఖాన్ సాబ్ కొట్లాడినా కానీ పరాజయం నుంచి తప్పించలేక పోయాడు. 

విజయక్రాంతి, ఖేల్ విభాగం : న్యూజిలాండ్‌తో తొలి టెస్టులో ఆతిథ్య టీమిండియా 8 వికెట్ల తేడాతో పరాజయం పాలయింది. సుదీర్ఘ ఫార్మాట్‌లో ఓటమనేదే లేకుండా సాగుతున్న రోహిత్ సేనకు లాథమ్ ఆర్మీ పెద్ద షాకిచ్చింది. వర్షంతో మొదటి రోజు తుడిచిపెట్టుకుపోయినా కానీ న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సెంచరీతో ఆకట్టుకున్న యువ క్రికెటర్ రచిన్ రవీంద్రకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో టెస్టు పూనే వేదికగా 24వ తేదీ నుంచి జరగనుంది. 

ముంచిన ‘మ్యాట్’

వర్షంతో తొలి రోజు రద్దు.. వాతావరణం మబ్బులతో కమ్మేసి ఉన్న సమయంలో టాస్ గెలిచి కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ తీసుకున్నాడు. ఆ నిర్ణయం ఎంత పెద్ద తప్పిదమో ఇన్నింగ్స్ మొదలైన కాసేపటికే తెలిసి వచ్చింది. భారత స్టార్ బ్యాటర్లంతా పోటీ పడి మరీ పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా కేవలం 46 పరుగులకే కుప్పకూలింది.

ఏకంగా ఐదుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ 5 వికెట్లతో టీమిండియా నడ్డి విరిచాడు. మరో బౌలర్ ఓరూర్క్ కూడా 4 వికెట్లతో సత్తా చాటాడు. మన బ్యాటర్లు ఎంత ఘోరంగా ఔట్ అయ్యారంటే.. పట్టుమని పది పరుగులు కూడా కాకమునుపే ముగ్గురు బ్యాటర్లు, 40 లోపు తొమ్మిది మంది వెనుదిరిగారు. 

పగబట్టిన వరుణుడు.. 

భారత విజయాలు చూసీచూసీ వరుణుడికి కూడా విసుగొచ్చిందేమో.. ఈ మ్యాచ్‌లో ఇండియా కు వరణుడు అతి పెద్ద శత్రువుగా మారాడు. మన ఇన్నింగ్స్ సమయంలో మబ్బులతో నిండిపోయిన వాతావరణం.. కివీస్ బ్యాటింగ్ మొదలుపెట్టగానే 

కరుణించని వరుణ

మబ్బులు తొలిగిపోయి ఎండ కాసింది. దీంతో మన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బౌలర్ అయిన సౌథీ కూడా అర్ధ సెంచరీ చేశాడంటేనే పిచ్ ఎలా మారిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. 

ఖాన్ సాబ్ కొట్లాడినా.. 

ఎట్టకేలకు న్యూజిలాండ్ ఆలౌట్ అయిన తర్వాత రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత బ్యాటర్లు ఆచితూచి ఆడారు. తొలి వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత జైస్వాల్ (35) వెనుదిరిగాడు. కొద్ది సేపటికే రోహిత్ శర్మ (52) దురదృష్టవశాత్తు పెవిలియన్‌కు చేరుకున్నాడు. తర్వాత వచ్చిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (150), విరాట్ కోహ్లీ (70), పంత్ (99) భారీ భాగస్వామ్యాలు నెలకొల్పారు.

ఆ సమయంలో మరోసారి వరణుడు తన ప్రతాపం చూపించాడు. పంత్, సర్ఫరాజ్ బాగా ఆడుతున్న సమయంలో వచ్చిన వర్షం.. కివీస్ బౌలర్లకు మరలా వరంలా మారింది. దీంతో ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 462కు ఆలౌట్ అయింది. 107 పరుగుల టార్గెట్‌ను కివీస్ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. చివరి రోజు వర్షం పడి భారత ఓటమిని తప్పిస్తుందని అంతా ఆశపెట్టుకున్నా కానీ అలా జరగలేదు. 

మొదటి స్థానానికి 

ఢోకా లేదు.. 

డబ్ల్యుటీసీ పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో ఉన్న రోహిత్ సేన కివీస్‌తో తొలి టెస్టులో అనూహ్యంగా ఓడింది. అయినా కానీ మొదటి స్థానానికి మాత్రం ఎటువంటి ఢోకా లేకుండా పోయింది. కానీ పర్సంటేజీలో మాత్రం తగ్గుదల కనిపించింది.

న్యూజిలాండ్‌తో ఆడేటపుడు వర్షం వస్తే ప్రతిసారి మనకు ఓటమే ఎదురవుతోంది. 2019 ప్రపంచకప్ సెమీస్ నుంచి ఇది కొనసాగుతోంది. 2021 డబ్ల్యుటీసీ ఫైనల్‌తో పాటు, బెంగళూరు టెస్టులోనూ ఇదే సీన్ రిపీట్ అయింది.  

సుందర్‌కు పిలుపు.. 

రెండు, మూడు టెస్టుల కోసం వాషింగ్టన్ సుందర్ జట్టుతో చేరనున్నాడు. సుందర్ చివరిసారిగా 2021లో టెస్టు ఆడాడు.