10-03-2025 12:38:01 AM
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, మార్చి 9 (విజయక్రాంతి): హాస్టళ్ళలో, గురుకులాలలో రోజువారి మెనూ పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఆదివారం హవేలీ ఘన్పూర్ మండలంలో మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ వెనకబడిన తరగతుల బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లోని వంట గదిని పరిశీలించి, ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలాగే వంట సరకులను నిల్వ చేసే గదిని తనిఖీ చేసి, పప్పులను, వంట నూనె, బియాన్ని, కూరగాయలు, ఆకుకూరలు, తదితరాల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, అలాగే పాఠశాలల్లోని మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రయోగశాలలు, తరగతి గదులను తనిఖీ చేసి, నిత్యం పరిశుభ్రతా చర్యలు చేపట్టాలన్నారు.
ఈ క్రమంలో విద్యార్థుల హాజరు రిజిస్టర్, సరకుల నిల్వ రిజిస్టర్, వార్డెన్స్ హాజరు రిజిస్టర్, తదితరాలను తనిఖీ చేసి, ఈ రిజిస్టర్లలో వివరాలను సరైన విధంగా నమోదు చేయాలని, వాటిని సక్రమంగా నిర్వహించాలని సూచించారు. అదే విధంగా విద్యార్థులతో మమేకమై మాట్లాడి, ఎక్కడ నుంచి వచ్చారు? ఎలా చదువుతున్నారు? ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనాన్ని సమయానికి అందిస్తున్నారా? వంటి వివరాలను అడిగి తెలుసుకుంటూ, వారి అభ్యసన సామర్ధ్యాలను పరీక్షించి, చక్కగా చదువుకొని ఉన్నత విలువలతో తమ లక్ష్యాలను సాధించాలని మార్గనిర్దేశంచేశారు.