calender_icon.png 27 December, 2024 | 8:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం

19-09-2024 12:00:00 AM

దేశాభివృద్ధికి, సౌభాగ్యానికి, ప్రజారోగ్యం ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఆరోగ్యం అంటే శారీరక మానసిక, సాంఘిక ఆధ్యాత్మిక కుశలత. అంతే కానీ కేవలం ఒక వ్యాధి గాని, వైకల్యం కాని లేకపోవడం మాత్రమే కాదని పేర్కొనడం గమనార్హం. మానసిక ఆరోగ్యం ఆర్థిక  వ్యవస్థలో ఉత్పాదక శక్తిని, ఉత్పత్తిని పెంచుతుంది. మానసిక ఆరోగ్యం మానవాభివృద్ధికి, శ్రేయస్సుకు   పునాదిలాంటిది. మానవ జాతిలో శ్రామిక సామర్థ్యం ఇనుమడించి సమర్థవంతంగా పనిచేయడానికి దోహద పడుతుంది.

ఆరోగ్యమే మహాభాగ్యం అనేది సమాజజీవన విధానం కావాలి. ఆరోగ్యం బాగుంటేనే అంతా బాగుంటుంది. నేటి ఉరుకుల పరుగుల  జీవన విధానంలో మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం అంటున్నారు మానసిక వైద్య నిపుణులు. నాటి కాలాన్ని బట్టి పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం  అన్నారు. కాని ఇప్పడు ఆస్తులు,భౌతిక సంపదకై పెంపర్లాడే సంస్కృతి నెలకొంది .

పరుగుల  జీవితాలు

హైటెక్ యుగంలో మానవ జీవితం పరుగులమయమై, పోటీ, పోలికల వాతావరణం నెలకొన్నది. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఒకటే టెన్షన్ టెన్షన్ .. బిజీ జీవితం. కనీసం కుటుంబ సభ్యులతో సైతం గడుపలేని  దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. నేటి యువతరంలో శారీరక సమస్యలతో  పాటు మానసిక సమస్యల్లో వున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నది. కొందరు మానసిక సమస్యలు బయటకు చెప్పుకోలేక లోలోపల సతమతమవుతున్నారని ఆరోగ్య సర్వేలు వెల్లడిస్తున్నాయి.

మారిన సామాజిక,ఆర్థిక సాంస్కృతిక,సాంకేతిక మార్పుల వల్ల మానవులు  ఒడిదొడుకులకు గురవుతున్నారు. కాలానికి ఆనుగుణంగా అన్నివిషయాలలో మానవుడు వేగాన్ని పెంచాడు. అన్ని రంగాలలో సంపూర్ణ పోటీతత్వం పెరిగి పోయి భౌతిక సంపదపై మోజు పెరిగింది. అందరికంటే  ఎక్కువ ఆర్థిక సంపద కలిగిఉండాలన్న వాణిజ్యవాదం రాజ్యమేలుతున్నది. భౌతిక సంపదపట్ల కాంక్ష పెరిగి, బౌద్ధిక తాత్వికత తరిగి, నైతిక విలువలు క్షీణించి మానసిక ఆందోళన  ఒత్తిడి మనిషి పాలిటి శాపంగా పరిణమించింది. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను సంతరించుకుంది .

జీవిత లక్ష్యాలను సాధించడానికి, ఆనందంగా జీవించేందుకు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఆరోగ్యం బాగుండేలా చూసుకోవాలి. ఇందుకు కావలసిన అవగాహన చైతన్యం  ప్రజల్లో కలిగించి, అప్రమత్తంగా ఉండేందుకు కార్యాచరణ ప్రణాళికలను రుపొందించుకుని తగిన జాగ్రత్తలు పాటించాలి. మానసిక  ఆరోగ్యాన్ని అశ్రద్ధచేసినా, చికిత్సను మధ్యలో ఆపి వేసినా అదుపు తప్పే ప్రమాదం ఉంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి.

మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యాన్ని  తీవ్రంగా దెబ్బతీస్తుంది. మానవుడు శారీరక, మానసిక  దారుఢ్యత  పట్ల అప్రమత్తంగా ఉండేందుకు అవసరమైన ఆరోగ్యసూత్రాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. మానసిక రోగం  సమస్యలు చెబితే చాలామంది భయంతో వణికి పోతారు. మానసిక జబ్బు గురించి చర్చించడానికి, చెప్పుకోవడానికి సంకోచిస్తారు. తమలో తాము మధనపడి వ్యాధి తీవ్రతను పెంచుకునే ధోరణి పెరిగిందని ఆరోగ్య సర్వేలు చెబుతున్నాయి.

2020 నాటికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 45 కోట్ల మంది ప్రజలు మానసిక దుర్బలత్వంతో, వైకల్యంతో బాధపడుతున్నారు. భవిష్యత్తులో ఈ సమస్య తీవ్రమయ్యే సూచనలున్నాయని వైద్య, ఆరోగ్య అధ్యయనాలు వెల్లడించాయి. మానసిక ఒత్తిడి అనేది రెండవ అతిపెద్ద తీవ్రమైన వ్యాధిగా మారి ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపుతోంది. ముర్రే అండ్ లోపెజ్ 1996 లో జరిపిన అధ్యయనం ప్రకారం అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒత్తిడి  పెరిగి, మానసిక సమస్యలు  తీవ్రమై, మానసిక వ్యాధుల వైద్య ఖర్చులు మోయలేని ఆర్థిక భారాన్ని కలిగిస్తున్నదని తేలింది.

వైద్య పరిభాషలో మానసిక వైఫల్యాలను అనేక రకాలుగా పేర్కొంటారు. డిప్రెషన్, యాంగ్జుటై, యాంగ్జుటై న్యూరోసిస్, బైపోలార్ డిజార్డర్ ,సోషల్ యాంగ్జుటై డిజార్డర్,

పానిక్ డిజార్డర్,అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్, పోస్ట్ ట్రామా టెక్ డిజార్డర్, ఫోబియా, మానియా స్క్రిజోఫెనియా, డిల్లుషన్ డిజార్డర్, స్లీప్ డిజార్డర్,ఇన్ఫరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్,అడిక్షన్ ఇల్యూషన్ లాంటి మానసిక వైకల్యాలు వుంటాయి. మానసిక ఉద్రిక్తతలను తగ్గించుకోక పోవడం వల్ల, నిగ్రహశక్తి  కోల్పోవడం వల్ల మానసిక రుగ్మతలు పెరుగుతున్నాయి కష్టకాలంలో, (సమయంలో) క్లిష్ట పరిస్థితుల్లో ఒత్తిడికి లోనుకాకుండా,కుంగి పోకుండా మనోధైర్యంతో ఆలోచనలు చేస్తే మెదడు సక్రమంగా పనిచేస్తుందని వైద్యుల సలహా. మానసిక ఒత్తిడి విషవలయంలో పడకుండా ఓర్పు,సహనం, ప్రశాంతత, నిగ్రహం అలవరుచుకోవాలి.

వృద్ధుల్లో మానసిక కుంగుబాటు

ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నం కావడం,నవ నాగరికత,విదేశీ సంస్కృతి,విదేశీ చదువులు,విదేశీ కొలువులపై పెరిగిన క్రేజీ వల్ల వృద్ధాప్యంలో ఉండే ఒంటరి తల్లిదండ్రుల సంఖ్య రోజురోజుకు పెరిగి పోతున్నది. ఆత్మీయత కరువై ఆందోళన, ఒత్తిడి వారికి శాపంగా పరిణమించింది ఈ స్థితివల్ల చాలా మంది వృద్ధులు మానసిక వ్యాధులతో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఆరోగ్య సర్వేలో తేలిననిజం. వృద్ధులతో పాటు మధ్య వయసు వారిలో కూడా మానసిక వ్యాధులు వస్త్తున్నాయి. మానసిక చికిత్స కేంద్రాలకు వచ్చే వారిలో  వృద్ధులు 25 శాతం మంది ఉన్నారని సర్వేలో తేలింది.

వృద్ధులు ఎక్కువగా డిప్రెషన్,నిద్రలేమి,ఆందోళన, కుంగుబాటు, డిమెన్షయాలాంటి  మానసిక రుగ్మతలతో ఆసుపత్రులకు వస్తున్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంది. సాంఘికంగా,ఆర్థికంగా మహిళలకు సాధికారిత కలిపించాలి. వయోవృద్ధులకు  సాంఘిక సహాయాలు అందించడం, డే సెంటర్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ నెలకొల్పాలి. ప్రభుత్వం,స్థానిక సంస్థలు,విద్యాసంస్థలు,మహిళా యువజన సంఘాలు, సామాజిక సాంస్కృతిక స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం మానసిక ఆరోగ్య అక్షరాస్యత పరి వ్యాప్తికి  చిత్త శుద్ధితో కృషి చేసి ‘మానసిక ఆరోగ్యమే మహాభాగ్యం’అన్నది నినాదం కాకుండా విధానంగా వర్ధిల్లాలి.

 నేదునూరి కనకయ్య