సిఐటీయు జిల్లా కోశాధికారి జి.భాస్కర్
దుబ్బాక,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండావెళ్లి గ్రామంలో భవన నిర్మాణ కార్మికులతో కరపత్రం విడుదల చేయడం చేశారు. అనంతరం సిఐటీయు జిల్లా కోశాధికారి జి.భాస్కర్ మాట్లాడుతూ.... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల సంస్మరణ సభ దుబ్బాక లో సెప్టెంబర్ 12వ తేది రోజున నిర్వహిస్తున్నట్టు తెలిపారు.భూమి కోసం,భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నాడు సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అని అన్నారు.
ఈ ప్రాంతం హైద్రాబాద్ సంస్థానం నిజాంనవాబు నిరంకుశ పాలనలో ఉండేదనీ అప్పటి తెలంగాణలోని గ్రామాల్లో వెట్టి చాకిరి,భూస్వామ్య, పటేల్,పట్వారీ వ్యవస్థకు వ్యతిరేఖంగా,బాంచెను దొర నీకాల్మొక్తా అనే రోజులు పోవాలని,దున్నేవాడికే భూమి కావాలని సాగిన మహత్తర వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కమ్యూనిస్టులు, ప్రజలు 4500 మంది ప్రాణాలర్పించారనీ గుర్తు చేశారు. రైతాంగ సాయుధ పోరాటం వెట్టి చాకిరి, జాగీర్ దార్లు, జమీందార్లు, భూస్వాముల దోపిడి, దౌర్జాన్యాల నుండి ప్రజలను విముక్తి చేసిందని తెలిపారు.
తెలంగాణ పల్లెలను దొరలు, భూస్వాములు, నిజాం రజాకార్ల నుండి విముక్తి కల్పించి 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర, కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండాదనీ అన్నారు. ఈ పోరాట స్పూర్తితో దేశమంతా రైతాంగం, ప్రజలు పోరాటాలు చేశారనీ,తెలంగాణ ప్రాంతంలో నిజాం నిరంకుశత్వం,భూస్వాములకు వ్యతిరేకంగా దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ,షేక్ బందగీ, షోయబుల్లాఖాన్, ఏసిరెడ్డి నర్సింహ్మా రెడ్డి, భీంరెడ్డి నర్సింహ్మా రెడ్డి, మల్లు స్వరాజ్యం, కేవల్ కిషన్ లాంటి ఎందరో త్యాగధనులు పోరాడారని గుర్తు చేశారు.
ఈ పోరాటం కుల, మత ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరిని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఐక్యం చేసి పోరాటాలు నిర్వహించారని తెలిపారు.కుల,మతాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ ఆ పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు.తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట సంస్మరణ సభ దుబ్బాకలో 12వ తేదీన నిర్వహిస్తున్నామని ఈ సంస్మరణ సభలో ఈ ప్రాంతంలోని కార్మికులు, రైతులు అన్ని వర్గాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.