- సభ్యత్వ నమోదుపై బీజేపీ దృష్టి
- రాష్ట్రంలో కొత్తగా 72 లక్షల మందిని చేర్చుకోవడమే లక్ష్యం
- ఇప్పటికే జిల్లాల వారీగా ప్రబారీల నియామకం
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): సభ్యత్వ నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి సారించింది. మిస్డ్‌కాల్ ద్వారా పార్టీలో చేరే అవకాశం కల్పిస్తోంది. 18 కోట్ల మంది సభ్యులతో ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఈసారి సైతం దేశవ్యాప్తంగా కొత్తగా 10 కోట్లకు పైగా సభ్యత్వాలను కొత్తగా నమోదు చేసే లక్ష్యంతో ముందుకుసాగుతోంది. కేవలం మిస్డ్ కాల్ ఇస్తే పార్టీలో చేరొచ్చని, 8800002024 నంబర్‌కు కాల్ చేసి సభ్యత్వం పొందాలంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది.
తెలంగాణలో నూ సభ్యత్వ నమోదుపై పార్టీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నెల 3నే కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాల్సి ఉండగా.. రాష్ట్రంలో వరదల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేశారు. వరద బాధితులకు సాయం చేయడమే ప్రథమ ప్రాధాన్యంగా పార్టీ పెద్దలు చెబుతున్నారు. అయితే పార్టీలో అంతర్గతంగా సభ్యత్వ నమోదు కోసం సిద్ధమయ్యేందుకు జిల్లాల వారీ గా ప్రబారీలను నియమించారు. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి బీజేపీని బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు ముందుకు కదులుతున్నాయి.
బీజేపీ లోకి ఆహ్వానించడమే లక్ష్యంగా..
బీజేపీకి ప్రస్తుతం 18 కోట్ల మంది సభ్యులున్నారు. కొత్తగా 10 కోట్ల మందిని చేర్చుకోవాల ని పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో సభ్యులుగా ఉన్న వారు సైతం తిరిగి సభ్యత్వాలు తీసుకోవాలిన పార్టీ నేతలు చెబుతున్నారు. తెలంగాణలో 2014లో పార్టీలో 11 లక్షల మంది సభ్యులుండగా, 2019 నాటికి ఆ సంఖ్య 18 లక్షలకు చేరింది. 2024లో రాష్ట్రవ్యాప్తంగా భారీగా సభ్యులను చేర్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాష్ట్రంలోని 36 వేల పోలింగ్ బూత్‌ల పరిధిలో ఒక్కో బూత్ నుంచి సుమారు 200 మందిని కొత్తగా చేర్చేందుకు పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. మొత్తంగా 72 లక్షల మందిని సభ్యులుగా చేర్చుకునేందుకు కసరత్తు చేస్తోంది.
జిల్లాల వారీగా ప్రబారీలు...
సభ్యత్వ నమోదు ప్రక్రియ కోసం జిల్లాల వారీగా ప్రబారీలను నియమించింది. 33 జిల్లా లు ఉండగా... బీజేపీ మాత్రం 38 జిల్లాలుగా కార్యక్రమాలు చేస్తోంది. మేడ్చల్ అర్బన్, మేడ్చ ల్ రూరల్, రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్, గోల్కొండ, భాగ్యనగర్, మహంకాళీ, హైదరాబాద్ సెంట్రల్ పేర్లతో జిల్లాలను విభజించి 38 మంది ప్రబారీలను నియమించింది.
ప్రజల్లో ఆదరణ
దేశంలో ఊహించ ని విజయాలన్నీ బీజే పీ పాలనలోనే సాధ్యమయ్యాయి. అయో ధ్య రామమందిర నిర్మాణం, కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రుక్స్, సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్ వంటి కార్యక్రమాల ద్వారా బీజేపీ ప్రజల హృదయాల్లో నిలిచింది. అంతర్జాతీయంగా దేశాన్ని బలమైన శక్తిగా చాటేం దుకు మోదీ ఎంతో కృషి చేశారు. మన దేశం జోలికి వస్తే అంతే సంగతులని చెప్పేందుకు మాల్దీవులు పెద్ద ఉదాహరణ. దేశ సమగ్రతను కాపాడేది బీజేపీయే. అందుకే ప్రజలు స్వచ్ఛందంగా మిస్డ్ కాల్స్ చేసి మరీ బీజేపీలో చేరుతున్నారు. ఈసారి కూడా పెద్ద ఎత్తున బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుంది.
శాంతికుమార్,
బీజేపీ రాష్ట్ర కోశాధికారి