ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు.. తెలంగాణ ప్రభుత్వం
బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణరెడ్డి
హైదరాబాద్, జూలై 30 (విజయక్రాంతి): అసెంబ్లీలో సభ్యులు హూందాగా ప్రవర్తించాలని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకరమణరెడ్డి కోరారు. సభలో ప్రజల సమస్యలపై మాట్లాడుతున్నప్పుడు వినాల్సిన సభ్యులు.. పదేపదే అడ్డు తగులుతూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. బయట కలిసి తిరిగే ఎమ్మెల్యేలు సభలో ఎందుకు హుందాగా వ్యవహరించరని ప్రశ్నించారు. మంగళవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని ఆ పార్టీ నాయకులు అనుకుంటే తాను తెలంగాణ ప్రభుత్వం ఉందని భావిస్తున్నట్టు తెలిపారు.
రుణమాఫీని తాను స్వాగతిస్తున్నానని, ప్రభుత్వంలో మనమంతా సభ్యులమేనన్న సంగతి గుర్తు పెట్టుకోవాలన్నారు. తాను నిజాయితీగా గెలవాలని ఇప్పటివరకు ఆగానని, వేరే మార్గంలో గెలవాలనుకుంటే ఎప్పుడో అసెంబ్లీకి వచ్చేవాడినని చెప్పారు. సభ నడిచేటప్పడు సీనియర్లు తమలాంటి వారికి మార్గదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రిని తాను కోరేది ఒక్కటేనని.. రేపటి నాయకులకు మనమంతా ఆదర్శంగా నిలవాలని సూచించారు. తాను రాజకీయాలకు కొత్త కాదని, గతంలో జిల్లా పరిషత్తు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం తనకు ఉందని చెప్పారు.