calender_icon.png 28 December, 2024 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరిగిపోతున్న విదేశీ మారక నిల్వలు

09-11-2024 01:45:30 AM

ఐదు వారాల్లో  23 బిలియన్ డాలర్ల తగ్గుదల

న్యూఢిల్లీ, నవంబర్ 8:  దేశం వద్దనున్న విదేశీ మారక నిల్వలు రికార్డు గరిష్ఠ స్థాయి నుంచి వరుసగాఐదో వారమూ తగ్గాయి. విదేశీ ఫండ్స్ దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి వేగంగా నిధుల్ని వెనక్కు తీసుకుంటున్న నేపథ్యంలో శుక్రవారం ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకా రం  నవంబర్ 1తో ముగిసిన వారంలో ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) రిజర్వులు మరో 2.675 బిలియన్ డాలర్లు తగ్గి 682.13 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి.. సెప్టెంబర్ చివరినాటికి ఫారెక్స్ నిల్వలు 704.885 బిలియన్ డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠస్థాయికి చేరిన సంగతి తెలి సిందే. 

ఆ స్థాయి నుంచి వరుస 5 వారా ల్లో  దాదాపు 23 బిలియన్ డాలర్లు క్షీణించాయి. తాజాగా నవంబర్ 1తో ముగిసిన వారంలో విదేశీ మారక నిల్వల్లో ప్రధాన భాగమైన విదేశీ కరెన్సీ ఆస్తులు 3.902 బిలియన్ డాలర్లు తగ్గి 589.849 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. అమెరికా డాలరుయేతర కరెన్సీలైన యూరో, పౌండు, యెన్ తదితర విదేశీ కరెన్సీల విలువ డాలరుతో పోలిస్తే తగ్గుదల, పెరుగుదలను కరెన్సీ ఆస్తుల లెక్కింపులో పరిగణనలోకి తీసుకుంటారు. 

పెరిగిన బంగారం నిల్వలు

ఆర్బీఐ వద్దనున్న బంగారం నిల్వలు మాత్రం  సమీక్షావారంలో  1.224  బిలియన్ డాలర్లు పెరిగి 69.751 బిలియన్ డాలర్లకు చేరాయి. స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ (ఎస్‌డీఆర్‌లు) 1 బిలియన్ డాలర్లు తగ్గి18.219 బిలియన్ డాలర్ల వద్ద నిలిచాయి. ఐఎంఎఫ్ వద్దనున్న రిజర్వులు 4 మిలియన్ డాలర్లు పెరిగి 4.311 బిలియన్ డాలర్ల వద్దకు తగ్గాయి.