14-04-2025 12:20:35 PM
న్యూఢిల్లీ,(విజయక్రాంతి): పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,000 కోట్ల మోసం చేసి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ ఛోక్సీను బెల్జియం పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. బ్యాంక్ రుణ మోసం చేసి విదేశాలకు పారిపోయిన ఛోక్సీను స్వదేశానికి రప్పించేందుకు భారత్ త్రీవంగా ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో అతను బెల్జియంలో ఉన్నట్లు తెలియడంతో భారత దర్యాప్తు సంస్థలు పీఎన్బీ రుణం మోసం కేసులో ఛోక్సీ ప్రమేయం ఉందని ఆరోపిస్తూ భారత్ కుఅప్పగించాలని బెల్జియం కోరారు. భారత్ అభ్యర్థన మేరకు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అదుపులోకి తీసుకున్నట్లు అధికారిక వర్గాలు సోమవారం తెలిపాయి. శనివారమే ఛోక్సీని అరెస్టు చేశారని, ప్రస్తుతం అతను జైల్లోనే ఉన్నట్లు సమాచారం. అయితే, అనారోగ్య కారణాల రీత్యా అతడు బెయిల్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నాయి. ఈ నేపథ్యంలో చోక్సీని వేంటనే స్వదేశానికి రప్పించేందుకు సీబీఐ, ఈడీ అధికారులు బెల్జియంను అభ్యర్థించనున్నాయి. ఇటీవలే 26/11 దాడుల ప్రధాన సుత్రాధారి తహవ్వుర్ రాణాను అమెరికా నుంచి భారత్ రప్పించిన సంగతి తెలిసిందే.
ఈ పరిణామాల వేల మెహుల్ ఛోక్సీ అరెస్టుకు ప్రాధాన్యం సంతరించుకుంది. ముంబైలోని పీఎన్‌బీ బ్రాడీ హౌస్ బ్రాంచ్‌లో జరిగిన రూ.13850 కోట్ల రుణ మోసానికి బయటపడటంతో చోక్సీ, ఆయన మేనల్లుడు నీరవ్ మోదీ, వారి కుటుంబ సభ్యులు, ఉద్యోగులు, బ్యాంకు అధికారులు, ఇతరులపై 2018లో రెండు ఏజెన్సీలు కేసు నమోదు చేశాయి. చోక్సీ, ఆయన సంస్థ గీతాంజలి జెమ్స్, కొంతమంది బ్యాంకు అధికారుల సహకారంతో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసం చేసిన నేరానికి పాల్పడ్డారని, LOUలు (అండర్‌టేకింగ్ లెటర్లు) జారీ చేయడం ద్వారా మోసపూరితంగా బ్యాంకుకు రుణం ఇచ్చారని, నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా FLCలు (విదేశీ క్రెడిట్ లెటర్) పెంచారని, బ్యాంకుకు నష్టం కలిగించారని ఈడీ ఆరోపించింది. చోక్సీపై ఈడీ ఇప్పటివరకు మూడు చార్జిషీట్లు దాఖలు చేసింది. సీబీఐ కూడా ఆయనపై ఇలాంటి చార్జిషీట్లు దాఖలు చేసింది.