calender_icon.png 16 April, 2025 | 2:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెహుల్ ఛోక్సీ అరెస్ట్

15-04-2025 12:28:12 AM

ఏప్రిల్ 12న బెల్జియంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు 

ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఛోక్సీ

స్వదేశానికి రప్పించేందుకు ఈడీ, సీబీఐ సన్నాహకాలు

ఇప్పటికే రాణాను రప్పించిన భారత్

న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)కు దాదాపు రూ. 13 వేల కోట్ల మేర ఎగనామం పెట్టి విదేశాలకు పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహు ల్ ఛోక్సీ (65)ని బెల్జియం పోలీసులు ఈ నెల 12న అరెస్ట్ చేశారు. బెల్జియం ఆసుపత్రి లో చికిత్స తీసుకుంటున్న క్రమంలో పోలీసులు అతడిని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఛోక్సీ బెల్జియం జైలులోనే ఉన్నాడని తెలుస్తోంది. ఆరోగ్య కారణాల రీత్యా అతడు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆయన అరెస్ట్‌ను ఛోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ కూ డా ధ్రువీకరించారు.

పీఎన్‌బీని ఆయన దాదాపు రూ. 13 వేల కోట్ల మేర మోసం చేసినట్లు 2018లో ఆరోపణలు వెల్లువెత్తాయి. అనంతరం ఆయన తన మేనల్లుడు, గీతాంజలి జెమ్స్ అధినేత నీరవ్ మోదీతో కలిసి దేశం విడిచి పారిపోయాడు. అప్పటి నుంచి అతడిని స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

ఆయన సతీమణి ప్రీతి ఛోక్సీకి బెల్జియం దేశ పౌరసత్వం ఉండటంతో మెహుల్ కూడా ఇటీవల బెల్జియం పౌరసత్వాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకోసం ఆయన పలు తప్పుడు పత్రాలను సమర్పించాడు.  తప్పుడు పత్రాలను సమర్పించడమే కాకుండా స్విట్జర్లాండ్ పారిపోయేందుకు కూడా ప్లాన్ వేస్తున్నట్టు అనుమానించి.. బెల్జియం పోలీసులు ఛోక్సీని అదుపులోకి తీసుకున్నారు. ఛోక్సీ బెల్జియం పౌరసత్వం ‘ఎఫ్ రెసిడెన్సీ కార్డ్’ను కూడా పొందాడు. ఛోక్సీతో పాటు దేశం విడిచి వెళ్లిన నీరవ్ మోదీ లండన్ జైలులో ఉన్నాడు. 

అప్పగించాలని కోరనున్న భారత్

మెహుల్ ఛోక్సీని తమకు అప్పగించాలి భారత దర్యాప్తు సంస్థలు బెల్జియంను కోరే అవకాశం ఉంది. ఇటీవలే 26/11 ముంబై పేలుళ్ల నిందితుడు తహవూర్ రాణాను అమెరికా నుంచి రప్పించిన భారత దర్యాప్తు సంస్థలు, ఛోక్సీ విషయంలో కూడా బెల్జి యం సాయం తీసుకునే అవకాశం ఉంది. మెహుల్ ఛోక్సీకి సంబంధించిన కదలికలపై భారత దర్యాప్తు బృందాలు ఎప్పటికప్పుడు నిఘా పెట్టాయి. ఛోక్సీ బెల్జియంలో ఉన్నట్టు గతేడాది తెలుసుకున్న దర్యాప్తు సంస్థలు అక్కడి ఏజెన్సీలకు సమాచారం ఇచ్చాయి. అతడు భారత్‌లో బ్యాంకులను మోసం చేసి న విధానం గురించి కూడా కూలంకషంగా వివరించాయి. దీంతో ఏప్రిల్ 12న బెల్జియం పోలీసులు ఛోక్సీని అదుపులోకి తీసుకున్నారు. ఛోక్సీ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.

బెల్జియం పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో కూడా చక్రాల కుర్చీలోనే కనిపించాడు. ఇటీవల ఆయన తరఫు లాయర్ ఛోక్సీ వీడియో కాన్ఫరెన్స్‌లో విచారణకు హాజరవుతాడని కూడా కోర్టుకు విన్నవించాడు. పీఎన్‌బీని మోసం చేసిన తర్వాత ఛోక్సీ ఆంటిగ్వాకు పారిపోయి ఆ దేశపౌరసత్వం పొందాడు. 2021లో అంటిగ్వాలో అదృశ్యమై డొమినికా దేశంలో ప్రత్యక్షం అయ్యాడు. అప్పుడు డొమినికా పోలీసులు ఛోక్సీని అరెస్ట్ చేశారు. క్యూబా పారిపోయేందుకు ప్రయత్నిస్తూ అక్రమంగా డొమినికాలోకి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. అంతే కాకుండా 2020లో హంగేరియాకు చెందిన ఓ మహిళ ఛోక్సీని వలపువలలోకి దించిందని భార్య ప్రీతి ఆరోపించగా.. ఆ మహిళ తోసిపుచ్చింది. 

ధ్రువీకరించిన లాయర్

మెహుల్ ఛోక్సీ అరెస్ట్‌ను ఆయన తర ఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ధ్రువీకరించారు. ‘నా క్లయింట్ మెహుల్ ఛోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యాడు. ప్రస్తుతం అతడు కస్టడీలో ఉన్నాడు. బెయిల్ అప్పీ ల్ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాం. అతడు క్యాన్సర్ చికిత్స తీసుకుం టున్నాడు’ అని అగర్వాల్ తెలిపారు. అతడిని ఎలాగైనా భారత్‌కు తీసుకొచ్చేం దుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నా రు.  ఛోక్సీ మీద ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేసింది.