14-03-2025 11:18:39 PM
కొంత మంది మతోన్మాదులే కారణం
ఎక్స్ ఖాతాలో పీడీపీ చీఫ్ ముఫ్తీ
న్యూఢిల్లీ: పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ చీఫ్ మెహబూబా ముఫ్తీ(PDP Chief Mehbooba Mufti) సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంత మంది మతోన్మాదులు హోలీ వేడుకలను మైనార్టీలకు భయానికి కేంద్రంగా మార్చారని ఎక్స్ వేదికగా శుక్రవారం ఆరోపించారు. అధికారంలో ఉన్న వారి మద్దతుతోనే ఇది జరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ‘నాకు సంబంధించిన వరకు గంగా తెహ్‌జీబ్‌కు హోలీ చిహ్నం. నా హిందూ స్నేహితులతో ఈ పండుగను జరుపుకోవడం కోసం ఎంతగానో ఎదురుచూడం నాకు బాగా గుర్తుంది.
అయితే కొంత మంది మతోన్మాదులు ఈ వేడుకలను మైనార్టీలకు భయానికి కేంద్రంగా మార్చారు. అధికారంలో ఉన్న వారి మద్దతుతోనే ఇది జరుగుతోంది. దేశం మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది’ అని తన ఎక్స్ ఖాతాలో అభిప్రాయపడ్డారు. రంజాన్ రెండవ శుక్రవారం రోజు హోలీ పండుగ వచ్చిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనేక నగరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత పెంచారు. ఈ నేపథ్యంలో ముఫ్తీ తాజా వ్యాఖ్యలు చేశారు.