లండన్, సెప్టెంబర్ 16: బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన వార్తలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా ఆ కుటుంబానికి చెందిన మరోవార్త సంచలనంగా మారింది. అమెరికా నటి మేఘన్ మెర్కెల్‌ను వివాహం చేసుకొని రాజకుటుంబాన్ని వదిలి వెళ్లిపోయిన యువరాజు హ్యారీ గురించి, ఆయన భార్య మేఘన్ గురించి ది హాలీవుడ్ రిపోర్టర్ అనే వార్తా సంస్థ సంచలన కథనాన్ని ప్రచురించింది. మేఘన్ తిక్కపనులతో ఆమె ఇంట్లో పనిచేయటానికి సేవకులు ఎవరూ రావటంలేదని, వచ్చినా ఒకటి రెండు నెలలకు మించి ఉండటం లేదని పేర్కొన్నది.
ఇటీవల హ్యారీ 40వ పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆ రోజు మేఘన్ హై హీల్స్ వేసుకొని నియంతలా ప్రవర్తించిందని, దీంతో సేవకులతోపాటు అతిథులు కూడా భయబ్రాంతులకు గురయ్యారని హ్యారీ కుటుంబ సేవకులను ఉటంకిస్తూ ఆ వార్తా సంస్థ తెలిపింది. హ్యారీ, మేఘన్ ఇద్దరూ ప్రతి విషయంలో తెలివి తక్కువ నిర్ణయాలే తీసుకొంటారని పేర్కొన్నారు. వీరి వద్ద పనిచేయలేక ఎంతో మంది ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయారు. గత నెలలో వారి సిబ్బంది చీఫ్ కూడా ఉద్యోగం మానేశాడు. అతడు మూడు నెలలు మాత్రమే వారివద్ద పనిచేయగలిగాడని హాలీవుడ్ రిపోర్టర్ తెలిపింది.