calender_icon.png 11 January, 2025 | 5:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం సహాయనిధికి మెగాస్టార్ కోటి విరాళం

17-09-2024 05:40:31 AM

  1. రూ.కోటి అందజేసిన అమర్‌రాజా కంపెనీ
  2. వరద బాధితులకు అండగా ప్రముఖులు
  3. వరద బాధితులను ఆదుకుంటున్నం
  4. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): అందరి సహకారంతో వరద బాధితులను పూర్తిస్థాయిలో ఆదుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బాధితులను ఆదుకునేందుకు ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు సోమవారం పలువురు సీఎంను ఆయన నివాసంలో కలిసి తమ విరాళాలను అందచేశారు. సీఎం సహాయనిధికి మెగాస్టార్ చిరంజీవి రూ. 50 లక్షలు విరాళంగా అందచేశారు. తన కుమారుడు, నటుడు రామ్ చరణ్ తరపున మరో 50లక్షలను అందించారు. రెండు చెక్కులను సీఎం రేవంత్ రెడ్డికి చిరంజీవి అందచేశారు. అమర్ రాజా గ్రూప్ తరపున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి సీఎం సహాయనిధికి కోటి విరాళం అందజేశారు. వరద బాధితులకు అండగా ఉండేందుకు ముందుంటామని అరుణ కుమారి తెలిపారు.

నెల్లూరు మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి రూ.25 లక్షలు చెక్కు రూపంలో విరాళంగా అందచేశారు. తీవ్ర వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడిన ప్రజలందరిని ఆదుకునేలా ప్రభుత్వం కృషి చేయాలని, ప్రజాప్రతినిధులు, ప్రజలు, స్వచ్చంధసంస్థలు తమ వంతు పూర్తి సహకారం అందించాలని ఆయన కోరారు.  ఈ సందర్భంగా మేకపాటిని రేవంత్ రెడ్డి శాలువాలతో ఘనంగా సత్కరించి ఆయన అందచేసిన సహాయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. రాజమోహన్ రెడ్డి వెంట ఆయన తనయుడు మేకపాటి పృథ్వీరెడ్డి ఉన్నారు. గరుడపల్లి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్ సంజయ్ గరుడపల్లి ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.25లక్షలు విరాళంగా సీఎంకు చెక్‌ను అందించారు. సినీ నటుడు సాయిధరమ్ తేజ్ రూ.10లక్షలు విరాళం అందజేశారు. సినీ నటుడు విశ్వక్ సేన్ సైతం రూ. 10 లక్షల చెక్కును సీఎం సహాయనిధికి అందించారు. ప్రముఖ కమెడియన్ ఆలీ రూ. 3 లక్షల చెక్కును అందచేశారు.